నోబెల్‌ శాంతి బహుమతి-2022 రేసులో భారతీయులు.. కమిటీ ఫేవరెట్‌ ఛాయిస్‌?

5 Oct, 2022 14:50 IST|Sakshi

న్యూయార్క్‌: నోబెల్‌ బహుమతుల ప్రకటనల నడుమ.. ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో శాంతి బహుమతి ఎవరికి వెళ్లబోతోందా? అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. నోబెల్‌ శాంతి బహుమతి పరిశీలనలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ప్రముఖ మ్యాగజైన్‌ టైమ్‌ ఒక కథనం ప్రచురించింది.

భారత్‌కు చెందిన ఫ్యాక్ట్‌ చెకర్స్‌ మొహమ్మద్‌ జుబేర్‌, ప్రతీక్‌ సిన్హాలు నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఫేవరెట్‌గా ఉన్నట్లు టైమ్‌ మ్యాగజీన్‌ కథనం ప్రచురించడం గమనార్హం. ఆల్ట్‌ న్యూస్‌ సైట్‌ తరపున ఫ్యాక్ట్‌ చెకర్స్‌గా ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం.. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, బుక్‌మేకర్‌ల నుండి వచ్చిన అంచనాలు,  పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓస్లో (PRIO) ద్వారా ఆధారంగా రేసులో సిన్హా, జుబేర్‌ ప్రముఖంగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు శాంతి బహుమతి కమిటీ ఫేవరెట్‌గానూ ఈ ఇద్దరూ ఉన్నట్లు టైమ్‌ కథనంలో పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. జూన్‌ నెలలో 2018కి సంబంధించిన ట్వీట్‌ విషయంలో అరెస్టైన జుబేర్‌.. నోబెల్‌ శాంతి బహుమతి పరిశీలనలో ఉండడం గమనార్హం. నెల తర్వాత అతను జైలు నుంచి సుప్రీం కోర్టు బెయిల్‌ ద్వారా విడుదల అయ్యాడు. ఇక.. జుబేర్‌ అరెస్ట్‌ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. ‘‘భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అధ్వాన్నంగా ఉంది, జర్నలిస్ట్‌లకు ఇక్కడి ప్రభుత్వం ప్రతికూల, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది’’ అంటూ అమెరికాలోని జర్నలిస్ట్‌ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. 

నోబెల్‌ శాంతి బహుమతి 2022 కోసం..  341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్‌ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకుగానీ అసలు తెలియజేయదు. అయితే.. కొన్ని మీడియా హౌజ్‌లు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు.. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి. 

ఇక ఈ ఇద్దరు ఫ్యాక్ట్‌ చెకర్స్‌తో పాటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్‌ విమర్శకుడు అలెక్సీ నవెల్నీ, బెలారస్‌ ప్రతిపక్ష నేత స్వియాత్లానా, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌ డేవిడ్‌ అటన్‌బోరఫ్‌ తదితరులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి విజేతను అక్టోబర్‌ 7వ తేదీన ప్రకటిస్తారు.

ఇదీ చదవండి: ఈసారి టార్గెట్‌ జపాన్‌? 

మరిన్ని వార్తలు