వైమానిక దాడులు తీవ్రతరం

18 May, 2021 05:05 IST|Sakshi
గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుదాడి దృశ్యం

గాజాలో హమాస్‌› సొరంగమార్గాలు ధ్వంసం

9 మంది హమాస్‌ కమాండర్ల భవనాలు నేలమట్టం 

శాంతి స్థాపనకు అంతర్జాతీయ మధ్యవర్తుల యత్నాలు  

గాజా సిటీ: దాడులు నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్‌ పెడచెవిన పెడుతోంది. గాజాలోని హమాస్‌ నేతలు, స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులను మరింత ఉధృతం చేసింది. సోమవారం గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపించింది. 15 కిలోమీటర్ల మేర హమాస్‌ సొరంగాలను ధ్వంసం చేశామని, 9 మంది హమాస్‌ కమాండర్లకు చెందిన భవనాలను నేలకూల్చామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌– హమాస్‌ మిలటరీ మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు శ్రమిస్తున్నారు. ఇరువర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్‌ తాజా దాడుల్లో గాజాలోని హమాస్‌ అగ్రనేత ఒకరు హతమయ్యారు. తమ దేశంపై వేలాది రాకెట్ల దాడికి అతడే సూత్రధారి అని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది.  

గాజాలో మౌలిక వసతులు ధ్వంసం  
ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 200 మంది పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో 59 మంది చిన్నారులు, 35 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్‌ దాడుల్లో ఇప్పటివరకు 8 మంది ఇజ్రాయెల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో తమ నగరంలోని రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గాజా మేయర్‌ యహ్యా సర్రాజ్‌ చెప్పారు. ఇళ్లు ధ్వంసంకావడంతో 2,500 మంది నిరాశ్రయులయ్యారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ఉన్న ఒకేఒక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ఇంధనం నిండుకుంది.  

కాల్పుల విరమణకు యత్నాలు  
అమెరికా దౌత్యవేత్త హడీ అమర్‌ శాంతి చర్చల్లో భాగంగా సోమవారం పాలస్తీనియన్‌ అథారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ను ఒప్పించేందుకు రష్యా, ఈజిప్టు, ఖతార్‌ తదితర దేశాలు కృషి చేస్తున్నాయి. యుద్ధానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని యూరోపియన్‌ యూనియన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్‌ యధ్య పోరాటం రెండో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికిప్పుడు కాల్పుల విరమణ పాటించాలంటూ ఇరువర్గాలపై తాము ఒత్తిడి తీసుకురాలేమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సోమవారం సంకేతాలిచ్చారు.  

మరిన్ని వార్తలు