గాజా యుద్ధ విరామం అవసరమే.. మళ్లీ నోరు జారిన బైడెన్‌

2 Nov, 2023 09:17 IST|Sakshi

మిన్నెపోలీస్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య గాజాలో జరుగుతున్న యుద్ధానికి స్వల్ప విరామం అవసరమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ చేపట్టాలని ఐక్యరాజ్య సమితి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో.. ఆయన ఇలా నేరుగా స్పందించడం విశేషం. అయితే.. ఆ సమయంలో ఆయన నోరు జారారు.   

బుధవారం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్‌ ప్రసంగించారు. ఆ సమయంలో గాజాలో కాల్పల విరమణ అవసరం అంటూ ఓ వ్యక్తి నినాదాలు చేశాడు. దానికి స్పందించిన ఆయన.. ‘‘అవును.. స్వల్ప విరామం అవసరమే. ఖైదీలను బయటకు క్షేమంగా తెచ్చేందుకు ఆ విరామం కచ్చితంగా అవసరం కూడా’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయనే చర్చ మొదలుకాగా.. వైట్‌హౌజ్‌ వివరణ ఇచ్చుకుంది. 

ప్రెసిడెంట్‌ బైడెన్‌,  హమాస్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను ఉద్దేశించి అలా వ్యాఖ్యానించారని వైట్‌హౌజ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందు ‘గాజాలో మనవతా సాయం ఆగిపోకుండా ఉండేందుకు యుద్ధానికి తాత్కాలిక విరమణ అవసరం’ అని వైట్‌హౌజ్‌ అభిప్రాయపడింది కూడా. 

అక్టోబర్‌ 7న హమాస్‌ దాడులతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. నాటి దాడుల్లో 1,400 మంది మరణించినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. ఆపై ఇజ్రాయెల్‌ ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడుల సమయంలో హమాస్‌ సుమారు 200 మందిని తమ బందీలుగా చేసుకుంది. ఇందులో ఇజ్రాయెల్‌ పౌరులతో పాటు సైనికులు, విదేశీయులు ఉన్నారు. వీళ్లను విడిపించేందుకు తీవ్ర యత్నాలు జరుగుతున్నాయి. హమాస్‌ బలగాల వేటలో గాజాను మరుభూమిగా మార్చేస్తోంది ఇజ్రాయెల్‌.

కిందటి నెలలో ఇజ్రాయెల్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే.. గాజాలో మరణాల సంఖ్య పెరగడం, మానవతా సంక్షోభం నానాటికీ దిగజారుతున్న వేళ ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణకు పిలుపు ఇచ్చింది. కానీ, ఇజ్రాయెల్‌ మాత్రం అందుకు అంగీకరించలేదు. మరోవైపు అమెరికా సైతం కాల్పుల విరమణకు బదులుగా.. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తే సరిపోతుందని.. తద్వారా గాజా ప్రజలకు సాయం అందేలా చూడాలని కోరుకుంటోంది.

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటిదాకా 8,796 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో పిల్లలే 3,648 మంది ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు బుధవారం బబాలియా శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 195 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్లు హమాస్‌ ప్రభుత్వం ప్రకటించుకుంది. 

మరిన్ని వార్తలు