అమెరికాలో గాంధీ విగ్రహానికి అవమానం 

14 Dec, 2020 07:07 IST|Sakshi

ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల దుశ్చర్య  

వాషింగ్టన్‌: అమెరికాలోని వాషింగ్టన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కొందరు ఖలిస్తానీ వేర్పాటు వాదులు విఫల యత్నం చేశారు. భారత్‌లో వ్యవసాయ చట్టాల రద్దుకి డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిక్కు అమెరికన్లు వాషింగ్టన్‌లో భారత రాయబార కార్యాలయం ఎదుట శనివారం నిరసన ప్రదర్శనకు దిగారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో, నార్త్‌ కరోలినా, మేరీల్యాండ్, వర్జీనియా నుంచి వందలాది మంది సిక్కు యువత కార్లతో ర్యాలీ చేస్తూ వాషింగ్టన్‌ చేరుకున్నారు. గాంధీ విగ్రహం ఎదుట వారు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండగా ఖలిస్తాన్‌ వేర్పాటు వాదులు జెండాలు చేతపట్టుకొని వారి మధ్యలోకి దూసుకువచ్చారు. ప్రత్యేక ఖలిస్తాన్‌ నినాదాలు చేస్తూ జెండాలతో గాంధీ విగ్రహం ముఖాన్ని కప్పేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. చదవండి: నెజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్‌! 

అక్కడున్న సీక్రెట్‌ ఏజెంట్లలో ఒకరు విగ్రహాలను ధ్వంసం చేయడం చట్ట ప్రకారం నేరమని అక్కడ్నుంచి వెళ్లిపోమంటూ సలహా ఇవ్వడంతో వారు పారిపోయారు. ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల ఈ దుశ్చర్యని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలంటూ అమెరికా విదేశాంగ శాఖని కోరింది. దుండగులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. విగ్రహాల ధ్వంసం, కట్టడాలపై దాడులు, స్మృతి చిహ్నాలను అవమానించినా పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఒక చట్టం తీసుకువచ్చారు. ఈ చట్ట ప్రకారం దుండగుల్ని శిక్షించాలంటూ భారత రాయబార కార్యాలయం డిమాండ్‌ చేసింది. 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో మహాత్ముని విగ్రహాన్ని అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న అటల్‌ బిహారి వాజ్‌పేయి ఆవిష్కరించారు.

>
మరిన్ని వార్తలు