16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై...

11 Mar, 2021 13:11 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: భార్యపై ప్రేమతో  ‘తాజ్‌మహల్‌’ లాంటి ప్రేమ సౌధాన్ని నిర్మించలేదు. గుడి కట్టి  దేవతనూ చేయలేదు. కానీ తనకు  శాశ్వతంగా దూరమైన  భార్య శవంతోనే 16 ఏళ్లుగా కాలం గడుపుతున్న కథనం ఒకటి తాజాగా వెలుగు చూసింది.  ఈ  అభినవ షాజహాన్‌  ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు.

వివరాలను పరిశీలిస్తే.. వియత్నాంకు చెందిన లీవాన్, 1975లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే 2003లో అకస్మాత్తుగా వాన్‌ భార్య చనిపోయింది.  దీంతో భార్యపై అమితమైన ప్రేమను చంపుకోలేక, భార్యనువిడిచి ఉండలేక ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నాడు. రోజూ శ్మశానానికి వెళ్లి ఆమె సమాధిపైనే నిద్రించేవాడు. అలా నెలలు తరబడి  అక్కడే గడిపేవాడు.

ఒక రోజు వర్షం కురవడంతో ఆందోళన చెందిన వాన్‌, ఏం చేయాలా అని ఆలోచించాడు. భార్యకు దగ్గరగా ఉండటానికి ఏం చేయాలా తపన పడ్డాడు. ఆమె సమాధి పక్కన ఒక సొరంగం తవ్వి, అక్కడే ఆమె  పక్కనే పడుకోవచ్చని అదే ఉత్తమమైన మార్గం అని నిర్ణయించు కున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని వాన్‌ సంతానం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ అతని మనసు శాంతించలేదు.. భార్యపై  ఉన్న ప్రేమ ఏమాత్రం చావలేదు. అందుకే  రాత్రికి రాత్రి భార్య సమాధిని తవ్వి, అవశేషాలన్నింటినీ ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే   కుళ్లి, పాడైపోయిన స్థితిలో ఉన్న భార్య అస్థికలను భద్రంగా ఎలా దాచాలా అని  మధనపడ్డాడు.  ఇక్కడే అతని బుర్రలో మరో ఆలోచన వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో ఒక మహిళ బొమ్మను తయారు చేసి, అందులో తన భార్య అస్థికలను పొందికగా అమర్చాడు. అలా ఆ బొమ్మను కాదు కాదు.. తన భార్యను తన పడకగదిలో పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతూ కాలం వెళ్లదీస్తున్నాడు.

మరిన్ని వార్తలు