సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశం.. మొబైల్‌ సేవలకు అంతరాయం!

20 Jul, 2022 08:37 IST|Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్షం నుంచి భారీ సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రభావంతో జీపీఎస్‌, మొబైల్‌, రేడియో సిగ్నళ్లకు అంతరాయం కలగొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది.

సౌర తుపాను ప్రభావం భూకక్ష్యలోని ఉపగ్రహాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్షంలో సంభవించే సౌర తుపానులు అప్పుడప్పుడు భూమిని తాకే సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆయా సమయాల్లో శాటిలైట్‌ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది కూడా.

శక్తివంతమైనదే!
జులై 15న సూర్యుడి ఉపరితలంపై శక్తివంతమైన సౌర జ్వాల మొదలైంది. బలమైన ఫొటాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్‌ విస్పోటనం వల్ల ఇది ఏర్పాడుతుంది. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. అయితే జులై 20-21 తేదీల మధ్య భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకవచ్చని ముందు నుంచి పరిశోధకులు చెప్తూ వస్తున్నారు. 

ఎఫెక్ట్‌.. 
గతంలో భూమి మీద సౌర తుపానుల ప్రభావం పడింది. సౌర తుపాను కారణంగా ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో ఖగోళ కాంతి ప్రకాశంగా కనిపిస్తుంది. అదే సమయంలో భూ వాతావరణం కూడా వేడక్కే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీపీఎస్‌, మొబైల్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చు కూడా.

మరిన్ని వార్తలు