Maximum Age: దీర్ఘాయుష్షు అంటే ఎంత?

7 Nov, 2023 12:02 IST|Sakshi

మనిషి ఆయుష్షుకు సంబంధించిన పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డచ్ పరిశోధకులు మానవుని గరిష్ట వయస్సు ఎంతనే విషయంతో పాటు ఇలాంటి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన పరిస్థితులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని తమ పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరులు డేటా ఆధారంగా నిపుణులు ఈ విశ్లేషణ చేశారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. రోటర్‌డామ్‌లోని టిల్‌బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లు అని కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని తెలియజెప్పారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త గట్టిదేనని చెప్పవచ్చు. 

మూడు దశాబ్దాల డేటా ఆధారంగా పరిశోధకులు మానవుని గరిష్ట ఆయుర్దాయాన్ని అంచనావేయగలిగారు. ఈ అధ్యయనాన్ని చేపట్టిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ ‘సాధారణంగా ప్రజలు దీర్ఘకాలమే జీవిస్తారు. గత 30 ఏళ్లలో మనిషి ఆయుష్షు పెరుగుతోంది. వృద్ధాప్యం దూరమయ్యింది. నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది’ అని అన్నారు. 

మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అంటారు. ఈ డచ్ పరిశోధనలు.. గత ఏడాది అమెరికా పరిశోధకుల పరిశోధనల నివేదికలను పోలివున్నాయి. అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఇదే గరిష్ట వయో పరిమితిని గుర్తించారు. అయితే తమ దేశంలో ఇప్పుడున్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు పేర్కొన్నారు. 

డచ్‌ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ‘ఎక్స్‌ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తీర్చేందుకు ఉపకరిస్తుంది. కాగా 122 సంవత్సరాల164 రోజులపాటు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ ఆయుష్షుకు అడ్డుపడే అన్ని అడ్డంకులను దాటారని ఐన్‌మహ్ల్ ఉదహరించారు. ఇప్పటివరకూ జీన్ కాల్మెంట్ అత్యధిక కాలం జీవించిన మహిళగా చరిత్రలో నిలిచారు. ఐన్‌మహ్ల్ మార్గదర్శకత్వలో జరుగుతున్న ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలు త్వరలోనే సమగ్రంగా ప్రచురితం కానున్నాయి. 
ఇది కూడా చదవండి: ‘ప్లీజ్‌.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు