Zoleka Mandela Death: క్యాన్సర్‌తో నెల్సన్‌ మండేలా మనవరాలు జొలేకా కన్నుమూత

27 Sep, 2023 07:41 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా(43) కన్నుమూశారు. జొలేకా..  రచయిత, ఉద్యమకారిణి కూడా.  చాలా కాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.  ట్రీట్‌మెంట్‌ కోసం ఈ నెల 18న ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. చిన్నవయసులోనే ఆమె కన్నుమూయడంతో మండేలా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

రొమ్ము క్యాన్సర్‌ కారణంగా.. జొలేకా ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని ప్రధాన భాగాలకు క్యాన్సర్ కణాలు వ్యాపించినట్టు వైద్యులు తెలిపారు. జొలేకా తొలిసారిగా 32 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌ బారినపడిన ఆమె చికిత్సతో కోలుకున్నారు. 2016లో మరోమారు అది బయటపడింది. కానీ, ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు.

నెల్సన్‌ మండేలా కూతురు జింద్జీకి జొలేకా 1980లో జన్మించింది. మండేలా సుదీర్ఘ జైలు జీవితం నుంచి విడుదలయ్యే సమయానికి జొలేకాకు వయసు 10 ఏళ్లు. రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా జొలేకా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లులు ఉన్నారు.  2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్‌గానూ అవగాహన కల్పిస్తున్నారు. లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలవాటు వంటి విషయాలను ఆమె ఇటీవలే ఓ డాక్యుమెంట్‌లో సైతం వెల్లడించారు. జొలేకా మృతికి నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపం ప్రకటించింది.

మరిన్ని వార్తలు