Viagra: 28 రోజులుగా కోమాలో.. వయాగ్రా అధిక మొత్తంలో ఇవ్వడంతో..

4 Jan, 2022 16:40 IST|Sakshi

లండన్‌: వైద్యశాస్త్రం ఒక మిరాకిల్‌. ఇందులో జరిగే పలు సంఘటనలు చూసి ఒక్కోసారి డాక్టర్లే ముక్కున వేలేసుకుంటుంటారు. తాజాగా జరిగిన ఓ ఘటన కూడా వైద్యశాస్త్ర ప్రముఖుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా చేసింది. కోవిడ్‌-19 సోకడంతో దాదాపు 28 రోజులు కోమాలో ఉన్న ఒక నర్సుకు డాక్టర్లు వయాగ్రా అందించిన తర్వాత అద్భుతంగా కోలుకున్నారు. 

వివరాల్లోకెళ్తే.. యూకేలోని లింకన్‌షైర్‌కు చెందిన మోనికా అల్మేడా (37) నవంబర్‌ 9న కరోనా సోకి ఆస్పత్రిలో చేరింది. ఒక వారం తర్వాత పరిస్థితి విషమించి నవంబర్‌ 16న కోమాలోకి వెళ్లడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆమె స్పృహలో ఉన్నప్పుడు అంగీకరించిన దాని ప్రకారం.. చికిత్స ప్రణాళికలో భాగంగా శృంగార సామర్థ్యాన్ని పెంచే వయాగ్రాను ఆమెకు అధిక మోతాదులో ఇచ్చారు.

ఇది శరీరంలోని ధమనులను మరింత ఉద్వేగానికి గురిచేసి రక్తప్రసరణ సాఫీగా జరిగి కోమా నుంచి బయటపడింది. ఆమె డిసెంబర్‌ 14న క్రిస్మస్‌ సమయానికి కోమా నుంచి బయటపడి తిరిగి ఇంటికి చేరుకుందని వైద్యులు తెలిపారు. కాగా, నైట్రస్‌ ఆక్సైడ్‌ మాదిరిగానే వయాగ్రాను కూడా ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుకోవడానికి ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవడానికి పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు.  

చదవండి: (మనుషులుండే ఊరు.. మనిషిలా ఉండే ఊరు..)

మరిన్ని వార్తలు