ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి.. సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే..

23 Nov, 2022 08:21 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ/బాలిక తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.. మానవ హక్కుల ఉల్లంఘనల్లో  మహిళలపై జరిగే హింస ముందు వరసలో ఉందని పేర్కొంది. నవంబర్‌ 25న ‘‘మహిళలపై హింసా నిర్మూలన‘‘ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఎన్‌ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింస విస్తృతమైనది. ప్రతీ 11 నిమిషాలకు ఒక మహిళ తన భాగస్వామి లేదంటే సొంత కుటుంబానికి చెందిన వారి చేతిల్లోనే ప్రాణాలు కోల్పోతోంది. కోవిడ్‌–19,  ఆర్థిక వెనుకబాటుతనం, ఇతర ఒత్తిళ్లతో మహిళలపై శారీరక, మానసిక హింస ఎక్కువైపోతోంది’’ అని గుటెరస్‌ పేర్కొన్నారు.

దీనిని ఎదుర్కోవడానికి దేశాలన్నీ కార్యాచరణ రూపొందించాలన్నారు. ‘‘మహిళలపై హింస అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పాటు పడే సంస్థలకు నిధులను 2026 నాటికి 50 శాతం పెంచాలి. మనందరం ఫెమినిస్టులమని గర్వంగా ప్రకటించుకోవాలి’’ అన్నారు.
చదవండి: ఇండోనేసియా భూకంపం.. 268కి చేరిన మృతులు

మరిన్ని వార్తలు