పాక్‌ ప్రజలకు భారీ పెట్రో వాత

17 Feb, 2023 04:20 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఆర్థికసంక్షోభం నుంచి కాస్తయినా తెరిపిన పడేందుకు సిద్ధమైన పాకిస్తాన్‌ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ధరల వాతలు పెడుతోంది. పార్లమెంట్‌లో పన్నుల వడ్డింపుతో కూడిన మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్ది గంటలకే ప్రజలపై ‘పెట్రో’ బాంబు పడేసింది. పెట్రోల్‌ లీటర్‌కు 22 పాక్‌ రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థికశాఖ విభాగం ఒక ప్రకటన విడుదలచేసింది. బుధవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం పాక్‌లో ఒక లీటర్‌ పెట్రోల్‌ ధర 272 పాక్‌ రూపాయలకు ఎగబాకింది. ఇక హైస్పీడ్‌ డీజిల్‌(హెచ్‌ఎస్‌డీ) ధర లీటర్‌కు 17.20 పాక్‌ రూపాయలు పెంచింది.

దీంతో హెచ్‌ఎస్‌డీ కొత్త ధర రూ.280కి చేరింది. కిరోసిన్‌పై 12.9 రూపాయలు పెంచింది. పెంపు తర్వాత లీటర్‌ కిరోసిన్‌ ధర రూ.202.73కి చేరింది. కొత్తగా ఉద్దీపన ప్యాకేజీ కింద 7 బిలియన్‌ డాలర్లలో ఒక దఫాగా 1.1 బిలియన్‌ డాలర్లు విదల్చాలంటే పన్నుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) షరతులు విధించడంతో పాక్‌ ఈ ధరల మోత మోగించింది. చలికాలంకావడంతో ఇప్పటికే కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌(సీఎన్‌జీ) స్టేషన్లలో సీఎన్‌జీ నిల్వలు నిండుకున్నాయి. దీంతో జనం రవాణాకు పెట్రోల్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫిబ్రవరిలో 3 బిలియన్‌ డాలర్లలోపునకు పడిపోయిన విదేశీ మారకద్రవ్య నిల్వలను కాస్తయినా పెంచుకునేందుకు పాక్‌ తిప్పలుపడుతోంది.

మరిన్ని వార్తలు