ప్రపంచ వాతావరణ సదస్సు కోసం దుబాయ్​కు మోదీ.. ఘన స్వాగతం

1 Dec, 2023 08:28 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దుబాయ్​ పర్యటనలో ఉన్నారు. కాన్ఫరెన్స్​ ఆఫ్​ పార్టీస్​(COP28) పేరుతో ఐక్యరాజ్యసమితి చేపట్టిన ప్రపంచ వాతావరణ మార్పు సదస్సులో పాల్గొననున్నారు. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​(యూఏఈ) అధ్యక్షతన దుబాయ్​లో జరగుతున్న ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలు హాజరుకానున్నాయి. గ్లోబల్​ వార్మింగ్​ ప్రభావంతో పోరాడుతున్న దేశాలకు సాయం చేసేందుకు ఓ నిధిని ఏర్పాటు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి.

ఈ మేరకు గురువారం రాత్రి దుబాయ్​కు మోదీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ మంత్రి, ఉప ప్రధాని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అదే విధంగా ఎయిర్​పోర్టులో ప్రధానికి ప్రవాస భారతీయుల నుంచి సాదర స్వాగతం లభించింది. ప్రధాని హోటల్‌కు చేరుకోగానే ‘మోదీ, మోదీ’, ‘అబ్‌కీ బార్‌ మోదీ సర్కార్‌’, ‘భారత్​ మాతాకీ జై’  అంటూ ఎన్నారైలు నినాదాలు చేయగా.. వారికి మోదీ అభివాదం చేశారు.

ప్రధాని తన ట్విటర్​లో ‘కాన్ఫరెన్స్​ ఆఫ్​ పార్టీస్​(COP28) సమ్మిట్​లో పాల్గొనేందుకు దుబాయ్​లో అడుగుపెట్టాను.  మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే లక్ష్యంతో కూడిన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్సింగ్, టెక్నాలజీ బదిలీ చేయాలని, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వారికి శక్తినివ్వాలి. ప్రవాస భారతీయుల నుంచి గొప్ప స్వాగతం లభించింది. ఇది వారి మద్దతు, ఉత్సాహం తమ శక్తివంతమైన సంస్కృతి, బలమైన బంధాలకు నిదర్శం’ అని  పేర్కొన్నారు.
చదవండి: ఎగ్జిట్‌ పోల్స్‌పై కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఏమన్నారు?

COP28లో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అనేది ఉన్నత-స్థాయి విభాగం. గ్రీన్‌హౌస్, ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మార్గాలను చర్చించడానికి ప్రపంచ నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీనితో పాటు ప్రధాని మోదీ మరో మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కాగా COP28 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు యూఏఈ అధ్యక్షతన జరుగుతోంది.

మరిన్ని వార్తలు