Viksit Bharat Sankalp Yatra: నాలుగు పెద్ద కులాలు.. పేదలు, యువత, మహిళలు, రైతులు

1 Dec, 2023 05:29 IST|Sakshi

ఆ నాలుగు కులాల అభివృద్ధే దేశాభివృద్ధి 

ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందిస్తాం

ప్రధానమంత్రి మోదీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: గత పదేళ్ల తమ పరిపాలన ప్రజల్లో తమ ప్రభుత్వంపై అంతులేని విశ్వాసాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరించాయని, ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధిని విస్మరించాయని ఆక్షేపించారు. గురువారం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’లో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

తన దృష్టిలో పేదలు, యువత, మహిళలు, రైతులు అనే నాలుగు పెద్ద కులాలు ఉన్నాయని, ఆ కులాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నాలుగు కులాల సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను తాను కచి్చతంగా నెరవేరుస్తాన్న సంగతి ప్రజలకు తెలుసని వెల్లడించారు. ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ సంతృప్తస్థాయిలో అందిస్తామని ప్రకటించారు. ఇందుకోసమే ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’కు శ్రీకారం చుట్టామని తెలపారు.  

భారత్‌ ఇక ఆగిపోదు.. అలసిపోదు  
ప్రజల ఆకాంక్షలు మొదలైన చోటునుంచే ‘మోదీ గ్యారంటీ’ ప్రారంభమవుతుందని   ప్రధానమంత్రి ఉద్గాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని ప్రజలు తీర్మానించుకున్నారని, భారత్‌ ఇక ఆగిపోదు, అలసిపోదు అని తేలి్చచెప్పారు. ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’కు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

‘డ్రోన్‌ దీదీ యోజన’ ప్రారంభం   
మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేసేందుకు ఉద్దేశించిన ‘డ్రోన్‌ దీదీ యోజన’ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ఈ పథకం కింద 2024–25 నుంచి 2025–26 వరకు ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేస్తారు. ఆయా సంఘాలు ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం రైతులకు అద్దెకు ఇచ్చి, ఆదాయం ఆర్జించవచ్చు. మహిళలకు వారి గ్రామాల్లో గౌరవ ప్రతిష్టలు దక్కాలని తాను ఆశిస్తున్నానని మోదీ చెప్పారు.

కొత్త శిఖరాలకు భారత ఆర్థిక వ్యవస్థ  
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, నిర్ణయాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరిందని ప్రధానమంత్రి మోదీ వివరించారు. ఎన్నెన్నో నూతన ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గురువారం ఢిల్లీలో రోజ్‌గార్‌ మేళాలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు సైతం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దుబాయ్‌ వెళ్లిన ప్రధాని మోదీ
వాతావరణ మార్పులు, వాటి ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్‌ తన హామీలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులను తట్టుకునేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును, సాంకతికతను అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలని ఆయన కోరారు. ఐరాస కార్యక్రమం కాప్‌–28లో భాగంగా శుక్రవారం జరిగే వరల్డ్‌ క్లైమేట్‌ యాక్షన్‌ సమిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి దుబాయ్‌కి బయలుదేరారు.

మరిన్ని వార్తలు