Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష

30 Nov, 2023 05:18 IST|Sakshi

సిల్‌క్యారా సొరంగం అనుభవాలను మీడియాతో పంచుకున్న కార్మికులు 

మొదట ప్రాణాలపై పూర్తిగా ఆశలు     వదులుకున్నాం..

అయినా ధైర్యం కూడదీసుకున్నాం  

రాళ్ల సందుల నుంచి జారిన నీటి చుక్కలు చప్పరించాం. 

బొరుగులతో కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం..

కాలక్షేపం కోసం పేకాట ఆడాం.. కాగితాలు చింపి విసురుకున్నాం 

సాక్సులను బంతులుగా చేసి, చోర్‌–సిపాయి ఆట ఆడాం, పాటలు పాడుకున్నాం 

భగవంతుడు ఎట్టకేలకు మా ప్రార్థనలు ఆలకించాడు..   

ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు.

ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్‌లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్‌ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్‌ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం.

బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు.  

మొదట్లో కష్టంగా గడిచింది  
సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌ గ్రామానికి చెందిన పుష్కర్‌సింగ్‌ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్‌ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్‌–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు.   

నిత్యం యోగా, వాకింగ్‌ చేశాం..
సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో  మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్‌ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు.

రిషికేశ్‌ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు   
సిల్‌క్యారా టన్నెల్‌ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు హెలికాప్టర్‌లో తరలించారు. డిజాస్టర్‌ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్‌క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు.   

కార్మికుల గ్రామాల్లో సంబరాలు  
ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్‌ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్‌ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్‌ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి.

ప్రశంసలందుకున్న నాగపూర్‌ నిపుణుల సేవలు  
సిల్‌క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్‌కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి.

సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు  
ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్‌ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్‌ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్‌ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్‌ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు.

తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా..   
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖీంపూర్‌ ఖేరీ జిల్లా భైరాంపూర్‌కు చెందిన 25 ఏళ్ల మంజీత్‌ చౌహాన్‌ సిల్‌క్యారా టన్నెల్‌లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్‌ తల్లిదండ్రులు భైరాంపూర్‌లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్‌ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను.

తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది.

సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్‌ వాల్‌పేపర్‌లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్‌ హైలైట్స్‌ చూస్తా’’ అని మంజీత్‌ చౌహాన్‌ ఉత్సాహంగా చెప్పాడు.  

సొరంగం పనులు కొనసాగుతాయి
ఉత్తరాఖండ్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్‌క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్‌ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్‌ధామ్‌ యాత్ర ఆల్‌ వెదర్‌ రోడ్‌’ ప్రాజెక్టులో భాగంగా సిల్‌క్యారా టెన్నల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో చార్‌ధామ్‌లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్‌ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం           జరుగుతోంది.  

కేబినెట్‌ భేటీలో మోదీ భావోద్వేగం
సిల్‌క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్‌ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు.   

మరిన్ని వార్తలు