క్షమాపణలు చెప్పిన వ్లాదిమిర్‌ పుతిన్‌

6 May, 2022 08:03 IST|Sakshi

జెరూసలేం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై కామెంట్లు చేసే తరుణంలో.. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉందంటూ రష్యా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్‌ క్షమాపణలు తెలియజేసినట్లు తెలుస్తోంది. 

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ ఈ మధ్య ఓ ఇటలీ మీడియా హౌజ్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. అడాల్ఫ్‌ హిట్లర్‌లోనూ బహుశా యూదుల రక్తం ఉండొచ్చని వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఉక్రెయిన్‌ను డీ-నాజీఫై చేస్తామంటూ ప్రకటించుకున్న రష్యా.. తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందంటూ లావ్‌రోవ్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ స్వయంగా ఓ యూదు. అయినప్పటికీ.. ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు.  


సెర్గీ లావ్‌రోవ్‌

కానీ, హిట్లర్‌లోనూ యూదు రక్తం ఉంది కదా. అదేం విషయం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ఈ వ్యాఖ్యల్ని చాలా దేశాల అధినేతలు, ప్రతినిధులు ఖండించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ లావ్‌రోవ్‌ వ్యాఖ్యల్ని క్షమించరానివంటూ మండిపడింది. ఈ తరుణంలో.. ఇజ్రాయెల్‌లోని రష్యా రాయబారిని పిలిపించుకుని మరీ.. సదరు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది.  పరిణామాలు మరీ వేడెక్కడంతో పుతిన్‌ ఫోన్‌లో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్టాలి బెన్నెట్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.


ఇజ్రాయెల్‌ ప్రధానితో పుతిన్‌ (పాత ఫొటో)

‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్‌ క్షమాపణల్ని ప్రధాని నఫ్టాలి బెన్నెట్‌ స్వీకరించారు. యూదులు, హోలోకాస్ట్‌   జ్ఞాపకం పట్ల రష్యా వైఖరిని తెలియజేశారాయన అంటూ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే క్రెమ్లిన్‌ వర్గాలు మాత్రం.. ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ మాత్రమే జరిగినట్లు ప్రకటన విడుదల చేసింది అంతే.

చదవండి: రష్యా ఆటలు మా గడ్డపై సాగవ్‌!

మరిన్ని వార్తలు