వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం.. ఫ్రీ-పాలస్తీనా టీషర్ట్‌తో మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి

19 Nov, 2023 16:56 IST|Sakshi

అహ్మదాబాద్‌: వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతుండగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లిని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. మ్యాచ్ నిర్వహణలో భద్రతా వైఫల్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి పాలస్తీనాను ప్రతిబింబించే వేషధారణను కలిగి ఉన్నాడు. ఎర్రని షార్ట్ ధరించాడు. తెల్లని టీ షర్ట్‌ ముందు భాగంలో పాలస్తీనాపై బాంబు దాడులు నిలిపివేయండి అని పేర్కొని ఉంది. టీషర్ట్ వెనుక భాగంలో ఫ్రీ పాలస్తీనా అని రాసి ఉంది. పాలస్తీనా జెండాను ప్రతిబింబించేలా మాస్క్‌ను ధరించాడు. మ్యాచ్ జరుగుతుండగా.. ఎక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. క్రీజ్ వరకు చేరుకుని విరాట్ కోహ్లిని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో రంగంలోకి దిగిన సిబ్బంది అతన్ని పట్టుకుని వెనక్కి తీసుకెళ్లారు.

క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట ‍బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లకు 182 పరుగులు సాధించింది. 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు.      

ఇదీ చదవండి: పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సాయం

మరిన్ని వార్తలు