ఆ ఊరు ధ్రువపు ఎలుగుబంట్లకు నిలయం!

19 Nov, 2023 10:44 IST|Sakshi

ఒకప్పుడు సోవియట్‌ రష్యాలో అంతర్భాగమైన ఆ ఊరు పాతికేళ్లుగా ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం నార్వే అధీనంలోని స్వాల్‌బార్డ్‌ ద్వీపసమూహంలో ఉన్న ఈ ఊరి పేరు పిరమిడెన్‌. ఆర్కిటిక్‌ వలయానికి చేరువలో ఉన్న ఈ ద్వీప సమూహంలో ఏడాది పొడవునా హిమపాతం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడి కొండ దిగువ ఉన్న గని నుంచి బొగ్గును వెలికి తీసేవారు. గని కార్మికులు, ఇతర ఉద్యోగుల కోసం ఇక్కడ ఈ ఊరు ఏర్పడింది.

అప్పట్లో దాదాపు వెయ్యిమంది వరకు ఇక్కడ ఉండేవారు. ఈ ఊళ్లో  చర్చి, గ్రంథాలయం, పాఠశాల, క్రీడా ప్రాంగణం, ఇరవై నాలుగు గంటలూ పనిచేసే క్యాంటీన్‌ వంటి సౌకర్యాలు ఉండేవి. పాతికేళ్ల కిందట ఇక్కడ బొగ్గు నిల్వలు అంతరించిపోవడంతో ఊరి జనాభా అంతా ఇతరేతర ప్రాంతాలకు ఉపాధి కోసం తరలిపోయారు. ఊరి వెలుపల కాపలాగా ఉండే సైనిక సిబ్బంది తప్ప ఊళ్లోకి వెళితే మనుషులెవరూ కనిపించరు. వీథుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్న ధ్రువపు ఎలుగుబంట్లు మాత్రమే కనిపిస్తాయి. నిరంతర హిమపాతంతో మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించే ఈ ఊరు ఇప్పుడు ధ్రువపు ఎలుగుబంట్లకు ఆలవాలంగా మారింది. 

(చదవండి: ద్వీపం పుట్టడం చూశారా? కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం!)

మరిన్ని వార్తలు