లౌకికవాదం దిశగా ఇరాన్‌ అడుగులు

18 Sep, 2020 15:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌ను షియా ముస్లిం దేశంగా అక్కడి పాలకులు ఎప్పుడూ చెప్పుకోవడం మనకు తెలిసిందే. అయితే అక్కడ ముస్లింల ప్రాబల్యం తగ్గుతూ  లౌకికవాదం వేళ్లూనుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘గ్రూప్‌ ఫర్‌ అనలైజింగ్‌ అండ్‌ మెజరింగ్‌ ఆటిట్యూడ్స్‌ ఇన్‌ ఇరాన్, లాడన్‌ బోరౌమాండ్‌’ సహకారంతో ఇటీవల నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌లో 32 శాతం షియా ముస్లింలు, ఐదు శాతం మంది సున్నీలు, మూడు శాతం సూఫీ ముస్లింలు ఉన్నట్లు తేలింది. అంటే ముస్లింల సంఖ్య 40 శాతం అన్నమాట. 9 శాతం మంది తాము నాస్తికులమని చెప్పగా, ఏడు శాతం మంది ఆధ్యాత్మిక వాదులమని చెప్పారు.

8 శాతం మంది జొరాస్ట్రియన్లమని చెప్పుకోగా, 1.5 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. మొత్తం ఇరాన్‌ జనాభాలో 78 శాతం మంది దేవుడిని విశ్వసిస్తుండగా, వారిలో 37 శాతం మంది పునర్జన్మ ఉంటుందని నమ్ముతుండగా, స్వర్గ నరకాలు ఉంటాయని 30 శాతం మంది విశ్వసిస్తున్నారు. మొత్తం జనాభాలో పాతిక శాతం మంది దేవుడు కాకపోయినా మానవాతీత శక్తులున్నాయని నమ్ముతున్నారు. 20 శాతం మంది మాత్రం తాము ఏ శక్తులను నమ్మమని, నాస్తికులమని చెప్పారు. మతాన్ని విశ్వసిస్తున్న వారిలో తాము మత సంప్రదాయాలను ఆచరిస్తున్నామని 90 శాతం మంది తెలిపారు.
(చదవండి: వెయ్యిరెట్లకు మించి ప్రతీకారం : ట్రంప్)

జీవన క్రమంలో తమ భావాలను కోల్పోయామని 47 శాతం మంది తెలుపగా, తాము మతాన్ని మార్చుకున్నట్లు ఆరు శాతం మంది తెలిపారు. మతాన్ని వదులుకుంటున్న వారిలో ఇతర మతాల నుంచి క్రైస్తవ మతంలోకి మారుతున్న వారిలో ఎక్కువ మంది యువతీ యువకులే ఉంటున్నారు. ఈ లెక్కన ఇరాన్‌ ఆధునికతను సంతరించుకుంటూ లౌకికవాదం దిశగా అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇరాన్‌ ప్రభుత్వం 2016లో విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం ఆ దేశంలో 99.5 శాతం మంది ముస్లింలని పేర్కొంది.

అదే నిజమైతే 1979లో అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇస్లామిక్‌ తిరుగుబాటు ప్రభావం శూన్యమనే అనుకోవాలి. ఇస్లామిక్‌ తిరుగుబాటు వల్ల విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, దేశం అభివద్ధిని, ఆధునికతను సముపార్జించుకుందని విశ్లేషకులు ఎప్పుడో తేల్చి చెప్పారు. ఇరాన్‌లో మత మౌఢ్యం తగ్గుతోంది. పెరుగుతున్న అక్షరాస్యతతోపాటు తగ్గుతున్న జనాభా వద్ధి రేటు దీనికి నిదర్శనం. 2020లో ఇరాన్‌ జనాభా వద్ధిరేటు మునుపెన్నడూ లేనంతగా ఒక శాతానికి పడిపోయింది. గత యాభై ఏళ్లలో ఇరాన్‌ ప్రవాసీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు.
(చదవంండి: ఇరాన్‌తో చర్చలు ఫలవంతం)

మరిన్ని వార్తలు