చైనాపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సంచలన వ్యాఖ్యలు.. స్వర్ణ యుగం ముగిసింది!

29 Nov, 2022 11:09 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో తొలిసారి విదేశాంగ విధానంపై ప్రసంగించారు. బ్రిటన్‌ చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలవబడే సంబంధాలు ముగిశాయని వ్యాఖ్యానించారు. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని, ఇది మరింత తీవ్రమవుతున్నాయని మండిపడ్డారు. చైనా నిరంకుశ పాలనపట్ల బ్రిటన్‌ దృక్పథాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయమిదని అన్నారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు.

‘సామాజిక రాజకీయ సంస్కరణలకు దారితీస్తుందనే అమాయక ఆలోచనతో పాటు మాజీ ప్రధాని డేవిడ్‌ కెమెరూన్‌ కాలంలో స్వర్ణయుగంగా పిలవబడిన సంబంధాలు బ్రిటన్‌, చైనా మధ్య ముగిశాయని స్పష్టం చేస్తున్నాను. మన విలువలు, ఆసక్తులకు వ‍్యతిరేకంగా డ్రాగన్‌ దేశం వ్యవస్థాగత సవాలు విసురుతుందని మేము గుర్తించాం. ఇది తీవ్రతరమవుతూ.. మరింత నిరంకుశత్వం వైపు మళ్లుతోంది’ అని అన్నారు. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్‌ను చైనా పోలీసులు అరెస్ట్‌ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునాక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి ప్రపంచ వ్యవహారాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి సునాక్‌ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌తోపాటు అనేక ఇతర దేశాలు కూడా దీనిని అర్థం చేసుకున్నాయని అన్నారు. అలాగే ఉక్రెయిన్‌కు గత ప్రధానులు బోరిస్‌, ట్రస్‌ అందించిన మద్దతును కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ మిత్రదేశాలతో వాణిజ్యం, భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్‌ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..!

కాగా రిషి సునాక్‌ చైనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. ప్రధాని రేసులో ఉన్న సమయంలో కూడా బ్రిటన్‌తోపాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి భారత్‌ వరకు ఎన్నో దేశాలను చైనా లక్క్ష్యంగా చేసుకుందనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. బ్రిటన్‌ ప్రధానిగా తాను ఎన్నికైతే డ్రాగన్‌ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు. చైనా సాంకేతిక దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందిస్తానని తెలిపారు

‘జీరో కోవిడ్’ పేరుతో చైనా నాయకత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.  చైనాలోని పెద్దపెద్ద నగరాలు, యూనివర్సిటీలలో నిరసనలు చెలరేగుతున్నాయి. షాంఘైలో నిరసనకు దిగిన కొందరు, ‘షీ జిన్‌పింగ్ దిగిపోవాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు.  చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో బీబీసీ జర్నలిస్టు ఒకరిని పోలీసులు అరెస్టు చేసి కస్టడిలో ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. బీబీజీ ప్రతినిధిపై దాడి ఘటన  తీవ్రంగా కలవరపరిచిందని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ అన్నారు.
చదవండి: రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం

మరిన్ని వార్తలు