కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నాం

9 Sep, 2023 06:10 IST|Sakshi

ఉక్రెయిన్‌ సంక్షోభంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

లండన్‌: రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. విశాలమైన దేశం అయినందున ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు సహజంగానే ఉంటుందని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు.

ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి రష్యా నుంచి చమురు సరఫరాయే కారణమా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘రష్యాతో మాకు సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షం వైఖరి భిన్నంగా ఉంటుందని నేను భావించడం లేదు’అని వివరించారు. రష్యా నుంచి దూరంగా తమవైపు భారత్‌ను లాక్కునేందుకు పశ్చిమ దేశాల నేతలు ప్రయత్నించారా అన్న ప్రశ్నకు రాహుల్‌ గాంధీ.. ‘‘వాస్తవానికి భారత్‌కు రష్యాతో సత్సంబంధాలున్నాయి. అదేవిధంగా అమెరికాతోనూ సంబంధాలు న్నాయి.

భారత్‌ విశాల దేశం. పెద్ద దేశం కావడం వల్ల అనేక ఇతర దేశాలతో వివిధ స్థాయిల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరితోనైనా సంబంధాలు కొనసాగించే హక్కు భారత్‌కు ఉంది’అని రాహుల్‌ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ప్రతిపక్షం వైఖరిపై ఆయన..కశ్మీర్‌ అభివృద్ధిని కాంగ్రెస్‌ గట్టిగా కోరుతోంది. అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది’అని రాహుల్‌ వివరించారు. కశ్మీర్‌ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ దౌత్యం అవసరమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్‌ సూటిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్‌ మా సొంత విషయం. అందులో భారత్‌కు తప్ప మరెవ్వరి జోక్యం అవసరం లేదు’అని కుండబద్దలు కొట్టారు.  
 

మరిన్ని వార్తలు