Russia War: మరో రెండు దేశాలను టార్గెట్‌ చేసిన పుతిన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌

20 Apr, 2022 16:14 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఓడరేవు నరగం మరియుపోల్‌పై రష్యా దాడుల కారణంగా వేల సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. ఉ‍క్రెయిన్‌ అభ్యర్థన మేరకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది.

మారియుపోల్ నుండి ఉక్రెయిన్‌ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి రష్యా ఒప్పుకున్నట్టు ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్‌చుక్ టెలిగ్రామ్‌లో స్పష్టం చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం మానవతా కారిడార్‌పై రష్యాతో ప్రాథమిక ఒప్పందాన్ని పొందినట్టు ఆమె వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మరియుపోల్‌ నుంచి ఉక్రెయిన్‌ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించనున్నట్టు ఇరినా తెలిపారు. కాగా, ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుండి మానవతా కారిడార్ల ద్వారా సుమారు 3,00,000 మంది ఉక్రెయిన్‌ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు ఉక్రెయిన్ పేర్కొంది.

మరోవైపు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరికల పర్వం కొనసాగుతూనే ఉంది. నాటోలో చేరడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఫిన్లాండ్, స్వీడన్‌లను తాజాగా రష్యా హెచ్చరించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రకటించారు. ఇక, యుద్దం వేళ పుతిన్‌, జెలెన్‌ స్కీ మధ్య జెరూసలెంలో శాంతి చర్చల సమావేశాన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్‌ ఓ ప‍్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉండగా.. బుధవారం ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన 1053 సైనిక కేంద్రాల‌ను త‌మ‌ ద‌ళాలు అటాక్ చేసిన‌ట్టు పేర్కొన్న‌ది. ఉక్రెయిన్‌కు చెందిన 73 మిలిట‌రీ సంస్థ‌ల‌పై త‌మ ద‌ళాలు ఫైరింగ్ చేసిన‌ట్లు ర‌ష్యా తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన 106 ఆర్టిల్ల‌రీ ఫైరింగ్ పొజిష‌న్స్‌తో పాటు ఆరు పైలెట్ ర‌హిత విమానాల‌ను కూల్చిన‌ట్లు వెల్లడించింది. హై ప్రిషిష‌న్ మిస్సైల్ దాడి వ‌ల్ల 40 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందిన‌ట్లు ర‌ష్యా తెలిపింది.

ఇది చదవండి: బుధవారం రికార్డు స్థాయిలో ఎండలు.. ఆందోళనలో భారత సైంటిస్టులు

మరిన్ని వార్తలు