చైనా దూకుడు: మిస్సైల్‌ బేస్‌ల నిర్మాణం!

29 Aug, 2020 21:33 IST|Sakshi
డోక్లాం, నకు లా సమీపంలో డ్రాగన్‌ నిర్మాణాలు(ఫొటో కర్టెసీ: డెట్రెస్ఫా ట్విటర్‌)

న్యూఢిల్లీ/బీజింగ్‌: భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు కొనసాగుతున్న వేళ డ్రాగన్‌ మరోసారి దుందుడుకు వైఖరిని ప్రదర్శించింది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు ప్రయత్నాలతో పాటుగా ప్యాంగ్‌యాంగ్‌ సరస్సు వద్ద కొత్తగా నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో దూకుడు చర్యకు సంబంధించిన శాటిలైట్‌ ఫొటోలు బయటకు వచ్చాయి. వీటి ద్వారా డోక్లాం, నకు లా, సిక్కిం సెక్టార్ల వద్ద డ్రాగన్‌ కొత్తగా రెండు ఎయిర్‌ డిఫెన్స్‌ స్థావరాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. డోక్లాం పీఠభూమిలో భారత్‌- చైనా-భూటాన్‌ ట్రై జంక్షన్‌లో ఆర్మీ కార్యకలాపాలకు వీలుగా కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. (చదవండి: చైనాను వణికిస్తోన్న సమాధి ఫోటో..)

మూడేళ్ల క్రితం భారత్‌- చైనాల మధ్య ఘర్షణలకు దారి తీసిన సమస్యాత్మక ప్రాంతాలకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఈ మేరకు ఎయిర్‌ ఢిపెన్స్‌ బేస్‌లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. డెట్రెస్ఫా పేరిట ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజిన్స్‌ అనలిస్ట్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటోలు, వివరాల ప్రకారం.. లక్ష్యాలను పక్కాగా ఛేదించేందుకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ అధునాతన క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా ఈ స్థావరాలను అభివృద్ధి చేస్తోంది.(చదవండి: మారని డ్రాగన్‌ తీరు.. 5జీ నెట్‌వర్క్‌, సరికొత్త నిర్మాణాలు!

ఇక ఇప్పటికే బలగాల ఉపసంహరణ విషయంలో చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పు లదాఖ్‌లోని ఫింగర్‌ 5,8 ఏరియాల్లో డ్రాగన్‌ తన బలాన్ని మరింత పెంచుకున్నట్లు సమాచారం. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పడవలు తరలించి, గుడారాలు నిర్మించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో డోక్లాం వద్ద కూడా చైనా కవ్వింపు చర్యలకు దిగడం చూస్తుంటే ఇరు దేశాల వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2017తో డోక్లాం విషయంలో భారత్‌- చైనాల మధ్య సుమారు 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అనేక చర్చల అనంతరం అప్పటి వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. 

మరిన్ని వార్తలు