పాక్‌ ఎన్నికల బరిలో హిందూ యువతి.. నామినేషన్‌ దాఖలు.. ఎవరీ సవీరా ప్రకాష్‌?

26 Dec, 2023 09:56 IST|Sakshi

సవీరా ప్రకాష్‌.. పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైన వేళ మారుమోగుతున్న పేరు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా బనర్‌ జిల్లా నుంచి పోటీకి నామినేషన్‌ దాఖలు చేశారీమె. తద్వారా ఈ ఎన్నికల్లో ఆ ప్రావిన్స్‌ నుంచి నామినేషన్‌ ఫైల్‌ చేసిన తొలి మహిళగా.. అలాగే పోటీ చేయబోతున్న తొలి హిందూ మహిళగా వార్తల్లోకి ఎక్కారు. పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ఈ మధ్యే కీలక సవరణ చేసింది. సాధారణ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేయడం అందులో ఒకటి.

సవీరా తండ్రి ఓం ప్రకాశ్‌ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. హిందూ సంఘాల పోరాట సమితి సభ్యుడు కూడా. ఆయన అక్కడ పేరుపొందిన వైద్యుడు. మానవతా దృక్ఫథంతో పేదలకు ఉచిత వైద్యం అందించే వ్యక్తిగా ఆయనకంటూ పేరుంది అక్కడ. ఈ మధ్యే వైద్య వృత్తికి దూరంగా జరిగారు. అంతేకాదు.. 35 ఏళ్లుగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. అయితే తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. సవీర బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. సోమవారం బర్నర్‌లోని పీకే-25 స్థానానికి నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించింది కూడా.   

సవీర, అబోటాబాద్ ఇంటర్నేషనల్‌ మెడికల్‌ కాలేజీలో చదువుకుంది. ఆ సమయంలో బనర్‌ పీపీపీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా పని చేశారు. తాను వైద్య విద్య అభ్యసించే సమయంలో.. కళాశాలలో వసతుల లేమి తనను ఆలోచింపజేసేదని.. అదే తన రాజకీయ అడుగులకు కారణమని ఇప్పుడు చెబుతున్నారామె.  గెలిస్తే.. హిందూ కమ్యూనిటీ బాగుకోసం కృషి చేయడంతో పాటు మహిళా సాధికారత.. సంక్షేమ సాధన తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. మరోవైపు బనర్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెబుతున్న ఇమ్రాన్‌ నోషాద్‌ ఖాన్‌ అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.. సవీరకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని అంటున్నాడు. 

బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పీపీపీ ప్రస్తుతం అధికార కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే ఇదే బిలావల్‌ భుట్టో.. భారత్‌, కశ్మీర్‌పై గతంలో పలుమార్లు విషం చిమ్మడం తెలిసిందే. పాక్‌ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరగనుంది.

>
మరిన్ని వార్తలు