మనుషులకు తోకలు ఎలా మాయమైపోయాయి? ఇన్నాళ్లకు సమాధానం దొరికింది!

7 Nov, 2023 15:16 IST|Sakshi

కోతి నుంచి రూపాంతరం చెంది మనిషిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల ఏళ్ల మార్పు తర్వాత.. నేటి ఆధునిక మనిషిగా మార్పు చెందాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్యాప్లో చాలా మార్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైనది.. మనిషికి ఉన్న తోక మాయమైపోవడం! అవును.. తొలినాళ్లలో మనుషులకు తోకలు కూడా ఉండేవని.. పరిణామ క్రమంలో కొద్ది కొద్దిగా తోక మాయమైపోయింది. మరి ఆ తోక ఎప్పుడు మాయమైపోయిందో సరిగ్గా ఎవరికి తెలీదు.. ఈ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం!.

 దాదాపుగా ప్రతీ జంతువుకూ, పక్షికీ తోక ఉంటుంది. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి.. అవి పలు రకాలుగా ఉంటాయి. మనలో చాలా మందికి.. ఆ తోక గురించి తెలుసు తప్ప, అది ఎంతగా ఉపయోగ పడుతుందో తెలియదు. ఒక పక్షి ఆకాశంలో అలుపు లేకుండా ఎంతదూరమైనా ప్రయాణించడానికి కేవలం రెక్కలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా తోక కూడా ఉండాల్సిందే. లేదంటే.. వేగమే కాదు సరిగా ఎగరలేవు కూడా. నీటిలోని చేప సంగతి చూస్తే.. వాయువేగంతో ప్రయాణించే మీనాలకు తోకే ప్రధాన ఆధారం. ఉన్నట్టుండి ఏ టర్న్ తీసుకోవాలన్నా కూడా తోకే కీలకం.ఇక నాలుగు కాళ్ల జంతువులన్నీ.. పరిగెత్తాలన్నా.. నడవాలన్నా.. వాటి గమనాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి తోక  ఎంతో సాయం చేస్తోంది.

ఇక కొన్ని తేళ్లు, పాము వంటి విషపూరిత జీవులకు ఆ తోకే రక్షణ ఆయుధంలా పనిచేస్తుంది. అలాంటి తోకలు తొలుత మానవులకు కూడా ఉండేది. కానీ కాలక్రమేణ అది అదృశ్యమైపోయింది. ఇది ఎలా జరిగింద? ఎందువల్ల అనేది శాస్త్రవేత్తల మదిని తొలిచే ప్రశ్న. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 25 మిలియన్ల ఏళ్లక్రితం మానవులకు తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీని గురించి అప్పట్లో చార్లెస్‌డార్విన్‌  ఇచ్చిన వివరణ పెద్ద విప్లవంగా మారింది. ఒక్కసారిగా అందరీ దృష్టి ఈ దిశగా అడుగులు వేసేలా చేసి, పరిశోధనలు చేసేందుకు నాంది పలికింది.

కానీ తోక ఎలా కనుమరుగైందనేది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు జియా అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధన వివరణాత్మక సమాధానం ఇచ్చింది.  మానవ  పిండం తొలి దశలో తోకలా ఉండి  ఆ తర్వాత అది నెమ్మదిగా చీల్చుకుంటూ వెన్నుపూస, కండారాలుగా ఏర్పడతాయని అన్నారు.  ఆ క్రమంలో వచ్చే జన్యు మార్పులను గమనించారు. అలాగే తోకలు అభివృద్ధి చేసే జంతువుల జన్యవులో, తోకలేని మనిషి జన్యవులోనూ టీబీఎక్స్‌టీ అనే కామన్‌ జన్యు క్రమాన్ని గుర్తించారు. దీనిలో వచ్చే మార్పులు కారణంగానే తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీన్ని జన్యుమ్యుటేషన్‌గా పేర్కొన్నారు.

ఈ టీబీఎక్స్‌టీని జన్యుమ్యుటేషన్‌ని ఎలుకల్లో ప్రవేశ పెట్టగా వాటికి పుట్టిన సంతానంలో చాలా వరకు ఎలుకలు తోకను అభివృద్ధి చేయలేకపోయాయి. కొన్నింటికి చిన్నగానే ఉండిపోయింది తోక. ఈ జన్యు ఉత్పరివర్తనాల మ్యుటేషన్‌ను దాని తరువాత తరానికి పంపుతూ ఉంటుంది ఆ క్రమంలోనే తోకలు పూర్తిగా అదృశ్యమవుతాయని సవివరంగా వెల్లడించారు శాస్త్రవేత్తలు. 

(చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్‌" అంటోందా?)

మరిన్ని వార్తలు