టూరిస్టులకు థాయ్‌లాండ్‌ బంపర్‌ ఆఫర్

31 Oct, 2023 17:28 IST|Sakshi

నవంబర్ 10  నుంచి 2024, మే 10 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌

ఒక వ్యక్తికి 30 రోజుల వరకు ఛాన్స్‌

పర్యాటకులకు థాయ్‌లాండ్‌ (Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. భారత్‌, తైవాన్‌ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా  లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని నిర్ణయించింది.  సీజన్ సమీపిస్తున్నందున ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు థాయ్‌ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు.  

తాజా నిర్ణయంతో భారత్  తైవాన్‌  నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చని అధికార ప్రతినిధి చై వచరోంకే తెలిపారు. ఈ నవంబర్‌ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సీజన్లో 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ప్రయాణ రంగం ద్వారా  వచ్చే ఆదాయంతో ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారిన బలహీన ఎగుమతులను లోటును భర్తీ చేయాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది.  

కాగా థాయ్‌లాండ్‌కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్‌నుంచే  ఎక్కువ పర్యాటకుల తాకిడి ఉంటుంది. జనవరి -అక్టోబర్ 29 మధ్య, థాయ్‌లాండ్‌కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు.  తద్వారా  దేశానికి భారీ  ఆదాయమే సమకూరింది. 2019లో రికార్డు స్థాయిలో వచ్చిన 39 మిలియన్ల టూరిస్టుల్లో 11 మిలియన్లతో  టాప్‌లోని లిచింది చైనా.ఈ నేపథ్యంలోనే అయిన  కోవిడ్‌ తరువాత టూరిజం మార్కెట్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన చైనీస్ టూరిస్టుల కోసం సెప్టెంబరులో వీసా అవసరం లేకుండానే పరిమిత కాల పర్యటనకు అవకాశం కల్పించింది.
 

మరిన్ని వార్తలు