Worst Earthquakes in Asia: ఆసియాను వణికించిన భూ కంపాలివే..

4 Nov, 2023 11:23 IST|Sakshi

భూకంపం.. నివారించడం సాధ్యం కాని విపత్తు. అందుకే జాగ్రత్త, అప్రమత్తతే దీనికి పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కాగలిగితే భూకంపాల తరహా విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని కొంత వరకు నివారించవచ్చు. తాజాగా  నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో ఆసియా ఖండంలో సంభవించిన పది అతిపెద్ద భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రపంచంలో తరచూ విపత్తులకు గురయ్యే ఆసియాఖండంలో భూకంపాలు అత్యంత ప్రమాదకర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యూఎన్‌ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ (యూఎన్‌ఐఎస్‌డీఆర్‌) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలోని చైనా, భారత్‌, ఇండోనేషియా, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్  అత్యంత భూకంప ‍ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.

ఆసియాలోని నగరాలు చాలా వరకు ప్రణాళికాబద్ధంగా లేవు. అవి నిర్మితమైనప్పుడు లోపభూయిష్టంగా ఉన్నాయని బ్యాంకాక్‌లోని ఆసియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్‌నెస్ సెంటర్‌ అర్బన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అరంబెపోలా గతంలో తెలిపారు. కాగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్‌) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలో సంభవించిన పది అత్యంత భారీ భూకంపాలు ఇవే..

1. ఇండోనేషియా:
2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు మొత్తం 2,27,898 మంది మరణించారు. ఆ తర్వాత వచ్చిన సునామీ 14 ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలపై ప్రభావం చూపింది. ఇది జరిగిన మూడు నెలల తర్వాత ఉత్తర సుమత్రాలో 2005, మార్చి 28న 8.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించగా, సుమారు వెయ్యి మంది మరణించారు.

2. చైనా:
2008, మే 12న తూర్పు సిచువాన్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 87,587 మంది మృత్యువాత పడ్డారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 3,74,177 మంది క్షతగాత్రులయ్యారు.

3. పాకిస్తాన్:
2005, అక్టోబర్‌ 8న 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 86 వేల మంది మరణించారు. రాజధాని ఇస్లామాబాద్‌కు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర పాకిస్తాన్‌లో ఈ భూకంపం సంభవించింది.

4. ఇరాన్‌:
1990, జూన్‌ 21న ఉత్తర ఇరాన్‌లో సంభవించిన భూకంపంలో 50 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలొదిలారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భూకంప తాకిడికి ఇరాన్‌లోని మంజిల్‌, రడ్బర్‌ పట్టణాలు నేలమట్టమయ్యాయి. 

5. ఇరాన్:
2003, డిసెంబర్ 26న బామ్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 31 వేల మంది మరణించారు. ఇది రెండు వేల సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపం. ఈ భూకంపం తాకిడికి నగరంలోని 70 శాతం ధ్వంసమైందని నివేదికలు చెబుతున్నాయి.

6. జపాన్‌:
2011, మార్చి 11న జపాన్‌లో సంభవించిన సునామీ భూకంపంలో 20,896 మంది ప్రాణాలు కోల్పోయారు. 8.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. సాండియాకు 80 మైళ్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. 

7. భారతదేశం:
2001, జనవరి 26న భుజ్‌లో సంభవించిన భూకంపంలో 20,085 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. గుజరాత్‌లో దాదాపు సగం జనాభా ఈ విపత్తుకు ప్రభావితమయ్యింది.

8. టర్కీ:
1999 ఆగస్టు 17న పశ్చిమ టర్కీలోని ఇజ్మిత్‌లో  7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 17,118 మంది మరణించారు. ఈ భూకంపం  దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కు గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది.

9. భారతదేశం:
1993, సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని లాతూర్‌లో సంభవించిన భూకంపానికి 20 వేల మంది బలయ్యారు. ఈ భూకంప తీవ్రతకు లాతూర్‌ పట్టణమంతా ధ్వంసమయ్యింది. 40 సెకెన్లపాటు సంభవించిన ఈ భూకంపంలో 30 వేలమందికిపైగా ప్రజలు గాయపడ్డారు. 

10. ఇండోనేషియా: 
జావాలో 2006 మే 27న 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 5,749 మంది మృతి చెందారు. రెండేళ్ల వ్యవధిలో ఇండోనేషియాలో సంభవించిన మూడో అతిపెద్ద విపత్తు ఇది. 2009, సెప్టెంబరు 30న దక్షిణ సుమత్రాలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,117 మంది మృత్యువాత పడ్డారు.
ఇది కూడా చదవండి: ఏ రకమైన భూకంపం అత్యంత ప్రమాదకరం?

మరిన్ని వార్తలు