యుద్ధ నేరాలకు పాల్పడిన ఇజ్రాయెల్‌, హమాస్‌

28 May, 2021 14:15 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల చీఫ్‌ మిషెల్‌ బాచ్లెట్‌

జెనీవా: ఇటీవల ఇజ్రాయెల్‌కు, గాజాలోని హమాస్‌ మిలటరీకి మధ్య జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు భావిస్తున్నామని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం చీఫ్‌ మిషెల్‌ బాచ్లెట్‌ చెప్పారు. దీన్ని బయటకు తేవాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని గురువారం అభిప్రాయపడ్డారు. అంతేగాక ఇజ్రాయెల్‌-పాలస్తీనా మూల సమస్యను పరిష్కరించపోతే శాంతి కేవలం కొంతకాలం మాత్రమే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఐరాసలోని మానవ హక్కుల విభాగం ఓ ప్రత్యేక సెషన్‌ ద్వారా గాజాలోని పరిస్థితులపై చర్చించింది. ఈ నేపథ్యంలో యుద్ధనేరాల ప్రస్తావన వచ్చింది. వేలాది రాకెట్లను ప్రయోగించిన హమాస్‌ సైతం యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆమె స్పష్టం చేశారు. 

2014 తర్వాత జరిగిన అతి సంకట స్థితి ఇదేనని మానవ హక్కుల విభాగ హై కమిషనర్‌ కౌన్సిల్‌లో తెలిపారు. 11 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో గాజాలో 248 మంది మరణించగా, ఇజ్రాయెల్‌లో 12 మంది మరణించారు. ఈ వ్యవహారంలోని నిజానిజాలను తేల్చేందుకు నిష్పక్షపాత విచారణ జరగాలని, అందులో ఇజ్రాయెల్‌ లేదా గాజా వేలు పెట్టరాదని అప్పుడే నిజం బయటకు వస్తుందని మిషెల్‌ చెప్పారు. మిలటరీ పోస్టులను లక్ష్యంగా చేసుకొని ప్రజావాసాలపై దాడులు జరిపితే దాన్ని యుద్ధనేరంగా పరిగణిస్తారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా విషయంపై పలు ముస్లి దేశాలు ఐరాసలో ఓ తీర్మానం ప్రవేశపెట్టాయి. అది ఆమోదం పొందితే, ఆ ప్రాంతంలోని మానవహక్కుల ఉల్లంఘనలపై విచారణకు ఓ శాశ్వత కమిషన్‌ ఏర్పాటవుతుంది. ఈ సమావేశంలో ఇజ్రాయెల్, పాలస్తీనా రాయబారులు ప్రత్యారోపణలు చేసుకున్నారు.

చదవండి: గాజాకు అండగా మేముంటాం: అమెరికా

మరిన్ని వార్తలు