UK Political Crisis: రిషి, బోరిస్‌ నువ్వా, నేనా?

23 Oct, 2022 04:13 IST|Sakshi

ఆసక్తికరంగా బ్రిటన్‌ ప్రధాని రేసు

రిషికి 100 మంది ఎంపీల మద్దతు

హుటాహుటిన బ్రిటన్‌కు బోరిస్‌

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, తద్వారా ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు నామినేషన్‌ కోసం అవసరమైన 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఆయనకు ఇప్పటికే సమకూరిందని వారు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో కుటుంబంతో కరేబియన్‌ దీవులకు విహారయాత్రకు వెళ్లిన మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హుటాహుటిన లండన్‌ తిరిగొచ్చారు. ఆయనకు కూడా 100 మంది ఎంపీల మద్దతు సమకూరిందని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. రిషి, జాన్సన్‌ ఇప్పటిదాకా తాము రేసులో ఉన్నట్టు వెల్లడించలేదు. ఎంపీల మద్దతుపై కూడా ఏమీ మాట్లాడలేదు. పెన్నీ మోర్డంట్‌ మాత్రమే పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నానికల్లా 100 మంది ఎంపీల మద్దతు సాధించిన వారి మధ్య తదుపరి పోటీ ఉంటుంది.

రిషికి పెరుగుతున్న మద్దతు
రిషిని సమర్థిస్తున్న మంత్రులు, పార్టీ ఎంపీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు దేశ పౌరులకు విశ్వాసం కల్పించగల నేత ప్రస్తుతం రిషి మాత్రమేనని మాజీ ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌ అభిప్రాయపడ్డారు. మళ్లీ వెనకటి రోజులకు వెళ్లేమని బోరిస్‌నుద్దేశించి అన్నారు. అయితే మళ్లీ ప్రధాని కావాలని తహతహలాడుతున్న బోరిస్‌ పోటీ లేకుండా నెగ్గేలా వ్యూహాలు పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా రిషిని తప్పుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు