ప్రధాని మోదీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్‌

26 Dec, 2022 21:16 IST|Sakshi

కీవ్‌: సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న క్రమంలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు సోమవారం ప్రకటించారు. తన శాంతి ఫార్ములాను అమలు చేయడంలో భారత్‌ పాలుపంచుకుంటుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. జీ20 దేశాల సదస్సుకు భారత్‌ విజయవంతంగా అధ్యక్షత వహించాలని మోదీకి శుభాకాంక్షలు తెలిపినట్లు ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. 

‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడాను. జీ20 ప్రెసిడెన్సీని విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించాను. ఈ ప్లాట్‌ఫామ్‌ వేదికగా నేను శాంతి ఫార్ములాను ప్రకటించాను. దానిని అమలు చేసేందుకు భారత్‌ తన వంతు పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా. ఐక్యరాజ్య సమితిలో మానవతా సాయం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాను.’

- వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

ఈ విషయంపై భారత్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు జెలెన్‌స్కీతో పలు సందర్భాల్లో మాట్లాడారు. ప్రస్తుతం యుద్ధాలు చేసే సమయం కాదని, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు మోదీ.

ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు

మరిన్ని వార్తలు