ఐక్యరాజ్య సమితి అధ్యక్ష బరిలో ‘అరోరా ఆకాంక్ష’

13 Feb, 2021 17:06 IST|Sakshi
ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవి బరిలో నిలిచిన భారత సంతతి మహిళ అరోరా ఆకాంక్ష

ఐక్యరాజ్య సమితి అధ్యక్ష బరిలో నిలిచిన భారత సంతతి మహిళ

యూఎన్‌డీపీ ఆడిట్‌ కోఆర్డినేటర్‌గా ఉన్న అరోరా ఆకాంక్ష

మరో దఫా అధ్యక్షుడిగా కొనసాగాలని ఆశిస్తున్న ఆంటోనియో గుటెరస్‌

న్యూయార్క్‌‌: ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవి కోసం భారత సంతతికి చెందిన మహిళ బరిలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ఆడిట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న అరోరా ఆకాంక్ష(34) అధ్యక్ష బరిలో నిలిచినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఆంటోనియో గుటెరస్ పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యున్నత దౌత్యవేత్త పదవికి తాను పోటీ చేస్తున్నట్లు అరోరా గత నెలలోనే తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెలలో ‘‘అరోరా‌ఫర్‌ఎస్‌జీ’’ పేరిట ఆమె ప్రచారం సైతం ప్రారంభించారు.  

ఇక అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన అరోరా ఆకాంక్ష ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ప్రచార వీడియోను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం లోపల నడుస్తూ అరోరా ఈ వీడియోను తీశారు. గడిచిన 75 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని.. శరణార్థులను రక్షించలేదని ఆమె ఆరోపించారు. అందుకే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ అరోరా గనక ఈ పదవి చేపడితే.. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్ల చరిత్రలో సెక్రటరీ జనరల్‌ పదవి చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు.

కాగా, ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నారు. ఆయన మొదటి విడత పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. కొత్త సెక్రటరీ జనరల్ 2022 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2017 జనవరి 1న గుటెరస్ సెక్రటరీ జనరల్‌గా ప్రమాణం చేశారు. మరోసారి అధ్యక్షుడిగా పని చేయాలని గుటెరస్‌ ఆశిస్తున్నారు.

ఇక అరోరా ఆకాంక్ష విషయానికి వస్తే ఆమె టొరంటోలోని యార్క్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. భారతదేశంలో జన్మించిన అరోరా ఆకాంక్షకు ఓసీఐ కార్డ్ వుంది. అలాగే కెనడా పౌరురాలిగా ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగివున్నారు.

చదవండి: భారత్ సేవలకు సెల్యూట్‌: యూఎన్‌ చీఫ్‌
              డ్యాషింగ్‌ అడ్వైజర్‌

మరిన్ని వార్తలు