Sakshi News home page

సామూహిక శిక్షగా మారిన యుద్ధం

Published Fri, Oct 27 2023 3:54 AM

Sakshi Guest Column On Gaza City under Israeli siege

పశ్చిమాసియా ప్రాంతపు ప్రస్తుత నిత్యాగ్నిహోత్రాన్ని డాంబికాల మధ్య జరుగుతున్న యుద్ధం అని అంటే అతిశయోక్తేమీ కాదు. గాజాలో హమాస్‌ను కట్టడి చేశామని తమకు తాము సర్ది చెప్పుకునే ఇజ్రాయెలీలు ఒకవైపు.. ఇజ్రాయెల్‌తో వివిధ అరబ్‌ దేశాల సంబంధాలు సాధారణ స్థితికి వస్తే – అది కూడా పాలస్తీనా అంశంతో సంబంధం లేకుండా జరిగిపోతే – ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ రాజకీయాలకు అక్కరకొస్తుందని అమెరికన్లు మరోవైపు భావిస్తున్నారు.

కానీ నిత్య నిరాశావాది, స్వప్రయోజనాలే మిన్న అనుకునే నెతన్యాహూ రాజకీయాలు ఇజ్రాయెల్‌ ప్రయోజనాలను దెబ్బ తీశాయనడంలో సందేహం లేదు. ఒకరకంగా ఆయన హమాస్‌ ఆటలో పావు అయ్యారని చెప్పవచ్చు. ఇజ్రాయెల్‌కున్న ఆత్మరక్షణ హక్కును ఎవరూ కాదనరు. కానీ ప్రజలను నిర్బంధంలో ఉంచడం, ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా చేయడం ‘సామూహిక శిక్ష’ కిందకు వస్తుంది. 


అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్‌ ఉగ్రవాదుల దాడి యూదుల చరిత్రలోనే తీవ్రమైనదని అందరూ అంగీకరిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఇప్పుడు ఆ దాడికి ప్రతీకారం తీర్చుకుంటోంది. గాజా స్ట్రిప్‌కు నీరు, విద్యుత్తు, ఆహారం అన్నింటిని బంద్‌ చేసింది. పైగా ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇందులో కొన్ని జిల్లాలకు జిల్లాలు నేలమట్టమై పోయాయి.

అయితే చర్యల ద్వారా హమాస్‌ను గాజా స్ట్రిప్‌ నుంచి ఎలా తీసివేస్తారన్నది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఇజ్రాయెల్‌ ప్రణాళికలు మొత్తం బెడిసికొడుతూండగా ప్రస్తుతం అది కొత్త, విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్‌ ఇకనైనా కొంచెం ఆచి తూచి ముందడుగు వేయాలని మిత్రదేశాలే సూచిస్తూండటం ఇందుకు నిదర్శం.

అమెరికాకు అనుభవమే
ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఎదుర్కొంటున్న పరిస్థితికి, సెప్టెంబరు 11న అల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి తరువాత అమెరికా ఎదుర్కొంటున్న పరిస్థితికి సారూప్యం కనిపిస్తుంది. అప్పట్లో అమెరికా గ్లోబల్‌ వార్‌ ఆన్  టెర్రరిజమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మహా యుద్ధాన్ని ఒక్కసారి సమీక్షిస్తే అమెరికా అఫ్గానిస్తాన్ లో యుద్ధాన్ని కోరుకుందని, అదే సమయంలో ఇరాక్‌తో యుద్ధాన్ని ఎంచుకుందని చెప్పాల్సి వస్తుంది. రెండూ అమెరికాకు తలనొప్పి మిగిల్చిన మాటైతే నిజం. బాధితులు అఫ్గానిస్తాన్, ఇరాక్‌ ప్రజలు మాత్రమే.

ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేతలు కూడా ప్రజల బాధలు పట్టించుకునే స్థితిలో కనిపించడం లేదు. గాజాను సమూలంగా నేలమట్టం చేశాక, దాంతో సంబంధా లన్నీ తెంచేస్తామని ఇజ్రాయెలీ జనరళ్లు చెబుతున్నారు. అయినా సరే.. ఇజ్రాయెల్‌ పొరుగునే 20 లక్షల మంది బాధతప్త జనాభా ఉంటుంది. ఏదో ఒక ప్రాంతాన్ని మిలటరీ చర్యలకు అతీతంగా ఉంచినా సరే. 

ఇజ్రాయెల్‌ ఏర్పాటు ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ల గొట్టబడిన వారి శాపనార్థాలు ఇజ్రాయెల్‌కు తగులుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా అసమ్మతిని, వ్యతిరేకతను అణచివేసేందుకు సైనిక చర్య లనే ఆసరాగా చేసుకుంది ఇజ్రాయెల్‌. రహస్య గూఢచార వ్యవస్థ సాయంతో దాడులను ముందస్తుగా అణచివేస్తోందనీ అంటారు. 

ఇజ్రాయెల్‌ తన భద్రత చర్యల్లో భాగంగా 1967లో వెస్ట్‌బ్యాంక్, గాజాస్ట్రిప్‌లలోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది కూడా. ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ ఏర్పాటు కారణంగా నిర్వాసితులైన పాలస్తీని యన్లు ఎక్కువగా ఉంటారు. అంటే బలవంతంగా తమ ఇళ్ల నుంచి గెంటివేయబడిన వారన్నమాట. ఈ రకమైన చర్యలు ఇప్పటికీ కొన సాగుతున్నాయి. ఎలాగైతే ఉగ్రవాదాన్ని తమ ప్రతిచర్యగా హమాస్‌ ఎంచుకుందో.. అలాగే ఇజ్రాయెల్‌ కూడా పాలస్తీనియన్లను వారి స్వస్థలాల నుంచి తరిమేయడాన్ని ఒక పనిగా పెట్టుకుంది.

సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ వాటిని ఎదుర్కొనేందుకు పాలస్తీనా మొత్తమ్మీద శక్తిమంతమైన గూఢచార వ్యవస్థను, వేగులు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్‌వర్క్‌ అరబ్‌ దేశా లతోపాటు ఇరాన్  వరకూ వ్యాపించి ఉంది. గాజా చుట్టూ దుర్భేద్య మైన అత్యాధునిక ఏర్పాట్లు చేసుకున్నా హమాస్‌ ఇటీవల జరిపిన దాడి ఇజ్రాయెల్‌ శక్తియుక్తులను తక్కువ చేసి చూపుతోంది. 

పోటాపోటీగా హమాస్‌
పాలస్తీనాపై 38 ఏళ్ల ఆక్రమణ ముగిసిన రెండేళ్లకు అంటే 2005 లోనే హమాస్‌ సరిహద్దుల వెంబడి 45 కిలోమీటర్ల పొడవైన ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌ గాజాపై నాలుగుసార్లు వైమానిక, భూతల దాడులు చేసింది. 2008లో మూడు వారాలపాటు కొనసాగిన యుద్ధంలో వెయ్యిమంది పాలస్తీ నీయులు మరణించగా ఇజ్రాయెల్‌ తరఫున 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత 2012లో ఇజ్రాయెలీలు గాజా స్ట్రిప్‌పై ఎనిమిది రోజులపాటు తీవ్రస్థాయి దాడులు చేశారు. అలాగే 2014లో ఆరువారాలపాటు జరిగిన యుద్ధంలో మరోసారి వైమానిక, భూతల దాడులు జరిగాయి.

ఈ దాడుల్లో సుమారు రెండు వేల మంది పాలస్తీ నీయులు మరణించగా ఇజ్రాయెలీల ప్రాణనష్టమూ ఎక్కువగానే ఉందని అంచనా. 2021లో మొత్తం 11 రోజులపాటు మరోసారి ఇరు పక్షాల మధ్య యుద్ధం జరగ్గా హమాస్‌ రాకెట్లతో ఇజ్రాయెలీ పట్ట ణాలపై దాడులకు తెగబడింది. ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాను వైమా నిక, క్షిపణి దాడులతో అతలాకుతలం చేసింది. పాలస్తీనా తరఫున పోరాడిన 250 మంది, ఇజ్రాయెలీలు 13 మంది ప్రాణాలు కోల్పో యారు. తాజాగా ఈ ఏడాది మొదలైన ఘర్షణలో జరిగిన నష్టంపై ఇంకా మదింపు జరగలేదు. కాకపోతే ప్రాణనష్టం ఇరువైపులా పది వేలు ఆ పైమాటే అంటున్నారు. 

హింసకు హింసే సమాధానం అన్నట్టుగా సాగుతున్నాయి ఈ వ్యవహారాలు. ఈ నెల మొదట్లో జరిగిన హమాస్‌ దాడిలో ఇజ్రా యెల్‌కు జరిగిన ప్రాణనష్టాన్ని పరిగణించినా హమాస్‌ చేతుల్లోని బందీలను దృష్టిలో ఉంచుకున్నా ఈసారి యుద్ధం అంత ఆషామాషీగా ముగిసేది కాదని అర్థమవుతుంది. పాలస్తీనా మరోసారి దాడికి దిగ కుండా గట్టిగా బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్‌ యోచిస్తోంది. అయితే ఇజ్రాయెల్‌ ఇప్పటికే చాలాసార్లు ఇలా తీవ్రస్థాయిలో పాలస్తీనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. వాటి ఫలితాల ఆధారంగా మిలటరీ మార్గం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాజాలదని ఇజ్రాయెల్‌ ఇప్పటికే గుర్తించి ఉండాలి. 

రాజనీతిజ్ఞతా తోడవ్వాలి
గాజాలో హమాస్‌ ప్రాభవాన్ని తగ్గించేందుకు ఒకవైపున మిలటరీ దాడులు, ఇంకోవైపున రాజకీయ చర్యలు అత్యవసరమవుతాయి. ప్రతీకార దాడులు కేవలం హమాస్‌ కేంద్రంగా జరిగేలా ఇజ్రాయెల్‌ జాగ్రత్తలు తీసుకోవాలి. పాలస్తీనీయులకు భారీ ప్రాణ నష్టం జరగడం, ఇబ్బందులకు గురికావడం హింసాత్మక చక్రం గిర్రున తిరిగేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్‌ అర్థం చేసు కోవాలి. ఆత్మరక్షణ విషయంలో ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కును ఎవరూ కాదనరు. కానీ ప్రజలను నిర్బంధంలో ఉంచడం, ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా చేయడం అనేది ‘సామూహిక శిక్ష’ కిందకు వస్తుంది.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది నేరం. ప్రస్తుతం ఇజ్రా యెల్‌ జరుపుతున్న బాంబుదాడుల్లో విచక్షణ అనేది ఏదీ లేదన్నది సుస్పష్టం. ఇక హమాస్‌ అమాయక ప్రజలను రక్షణ కవచంగా ఉప యోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ కూడా యుద్ధ నియ మాలను పాటించేలా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు చర్యలు తీసు కోవాలి. లేదంటే దక్షిణార్ధ గోళ దేశాలు పాశ్చాత్య దేశాల విషయంలో దురభిప్రాయానికి వచ్చే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ చట్టాలు పాశ్చాత్యదేశాలు కేవలం తమ అనుకూలతకు తగ్గట్టుగా మలచుకుంటాయని ఇవి భావించే ప్రమాదం ఉంది. 

ఇజ్రాయెల్, దాని ప్రధాన మద్దతుదారైన అమెరికా.. పశ్చిమా సియా అనేది ఒకప్పటి అమెరికా ఆధిపత్యం చలాయిస్తున్న ప్రాంతాల్లో ఒకటి కాదని గుర్తుంచుకోవాలి. అలాగే ఇజ్రాయెల్‌ కూడా ఈజిప్టు, సౌదీ అరేబియా, ఖతార్‌... బహుశా ఇరాన్ తోనూ దీర్ఘకాలిక రక్షణ దృష్ట్యా రాజకీయపరమైన పరిష్కారాలు చేసుకోవడం మేలు. 

మనోజ్‌ జోషీ 
వ్యాసకర్త అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్  సభ్యులు 
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

What’s your opinion

Advertisement