Video: గోధుమ సాయంలో పాక్‌ చెత్త.. భారత్‌ బంగారం‌ అంటున్న తాలిబన్లు

5 Mar, 2022 10:31 IST|Sakshi

అఫ్గనిస్థాన్‌ పునర్మిర్మాణంలో పలు దేశాలు పాలు పంచుకుటున్న విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించుకున్నాక.. ఆర్థిక ఆంక్షల వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది. తాలిబన్‌ ప్రభుత్వానికి ఇంకా గ్లోబల్‌ గుర్తింపు దక్కనప్పటికీ.. నానాటికీ పరిస్థితి దిగజారిపోతుండడంతో మానవతా కోణంలో భారీ సాయమే అందుతోంది. ఈ క్రమంలో.. 


అఫ్గన్‌ పొరుగున ఉన్న పాక్‌ గోధుమలను అందించగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది అక్కడి ప్రభుత్వం. ‘‘పాక్‌ నుంచి పంపించిన గోధుమ నాసికరంగా ఉన్నాయి. తినడానికి అస్సలు పనికిరావు. చెత్తలోపారబోయడానికి తప్ప. ఎందుకు పంపారో ఆ దేశ ప్రభుత్వానికే తెలియాలి.  బహుశా ఖరాబును జమ చేసుకోవడం ఇష్టం లేక పంపారేమో’’ అంటూ మండిపడ్డారు అక్కడి అధికారులు. 

అదే సమయంలో భారత్‌ అందించిన గోధుమలపైనా స్పందించారు. భారత్‌ మేలిమి రకపు గోధుమలను అందించిందని, అందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. తాలిబన్‌ ప్రతినిధులు పాక్‌-భారత్‌ గోధుమ సాయంపై స్పందించిన వీడియో ఒక దానిని అఫ్గన్‌ జర్నలిస్ట్‌ అబ్దుల్లా ఒమెరీ ట్వీట్‌ చేశారు. దీనికి అఫ్గన్‌ నెటిజనుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. జై హింద్‌ అంటూ పలువురు అఫ్గన్‌ పౌరులు ట్వీట్లు చేస్తుండడం విశేషం.


ఇదిలా ఉండగా.. సంక్షోభ సమయం నుంచే భారత్‌, అఫ్గనిస్థాన్‌కు సాయం అందిస్తోంది.ఈ క్రమంలో రోడ్డు మార్గం గుండా సరుకులు పంపే సమయంలో పాక్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసి అడ్డుపడగా.. తమ దేశం గుండా అనుమతించి పెద్ద మనసు చాటుకుంది ఇరాన్‌. ఇదిలా ఉండగా.. అమృత్‌సర్‌ నుంచి మొన్న గురువారం 2వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగామ్‌లో భాగంగా యాభై వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంపాలనే కమిట్‌మెంట్‌కు కట్టుబడి.. సాయం అందిస్తూ పోతోంది భారత్‌. ఈ సందర్భంగా కోలుకుంటున్న అఫ్గన్‌తో భారత్‌ మంచి సంబంధాలు కోరుకుంటోందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు