అమెరికా సాయం అక్కర్లేదు!

10 Oct, 2021 05:18 IST|Sakshi
ఆత్మాహుతి దాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి

ఐసిస్‌ను సొంతంగానే ఎదిరిస్తాం

స్పష్టం చేసిన తాలిబన్లు

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లో పెట్రేగుతున్న ఐసిస్‌ సహా ఇతర ఉగ్ర గ్రూపుల అణచివేతకు అమెరికా సాయం కోరేదిలేదని తాలిబన్లు శనివారం స్పష్టం చేశారు. ఆగస్టులో అమెరికా అఫ్గాన్‌ నుంచి వైదొలిగిన అనంతరం తొలిసారి తాలిబన్లతో యూఎస్‌ శని, ఆదివారాల్లో దోహాలో చర్చలు జరపనుంది. ఈ సమయంలో తాలిబన్లు కీలక అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అఫ్గాన్‌లో తిష్టవేసుకున్న ఉగ్రతండాలను కట్టడి చేయడం, ఆదేశంలో ఉండిపోయిన విదేశీయులను వారివారి దేశాలకు పంపడంపై చర్చలు ఉంటాయని ఇరువర్గాలు తెలిపాయి.

వీటిలో విదేశీయుల తరలింపుపై తాలిబన్లు సానుకూలంగా ఉన్నారు. కానీ ఐసిస్‌ కట్టడికి అమెరికా సాయం కోరమని తాలిబన్‌ ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ చెప్పారు. తాజాగా అఫ్గాన్‌ మసీదులో ఐసిస్‌ జరిపిన ఆత్మాహుతిదాడిలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే! అయితే వీరిని తాము స్వతంత్య్రంగా ఎదుర్కోగలమని సుహైల్‌ చెప్పారు. యూఎస్‌ సేనలు అమెరికాలో ఉన్నప్పడు కూడా అఫ్గాన్‌ షియా మైనారీ్టలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్‌ దాడులు జరిపింది. తాలిబన్లు, అమెరికన్లకు ఐసిస్‌ వల్ల ప్రమాదం ఉన్నందున కలసికట్టుగా దీనిపై పోరాటం చేస్తారని విశ్లేషకులు భావించారు.  

గుర్తింపు కోసం కాదు
తాలిబన్లతో జరిపే చర్చలు, వారు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ముందస్తు సన్నాహాలు కాదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈచర్చలకు ముందు పాక్‌ మిలటరీ అధికారులతో అమెరికా డిప్యుటీ స్టేట్‌ సెక్రటరీ వెండీ షెర్మన్‌ ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యారు. ఇందులో కూడా అఫ్గాన్‌ పరిణామాలనే చర్చించినట్లు తెలిసింది. అఫ్గాన్‌ కొత్త  ప్రభుత్వాన్ని గుర్తించాలని, అమెరికాలో నిలిపివేసిన అఫ్గాన్‌ నిధులను విడుదల చేయాలని పాక్‌ యూఎస్‌ను అరి్ధంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే అఫ్గాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తాలిబన్లు తమ ప్రభుత్వంలో మరిన్ని వర్గాలకు చోటివ్వాలని, మానవహక్కులు, మైనార్టీ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పాక్‌ కోరింది. దేశంలో తమకు రక్షణ కరువైందని అఫ్గాన్‌ షియా పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా నుంచి అఫ్గాన్‌కు...
తాలిబన్ల దాడికి వెరిచి భారత్‌కు పారిపోయివచి్చన అఫ్గాన్‌ పౌరుల్లో వందమందికి పైగా స్వదేశానికి పయనమయ్యారని అఫ్గాన్‌ ఎంబసీ వర్గాలు తెలిపాయి. కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది అఫ్గాన్లు విదేశాలకు పారిపోయారు. ఇలా ఇండియా వచి్చనవారిలో పలువురు ప్రస్తుతం అఫ్గాన్‌ వెళ్లేందుకు ఇండియా నుంచి టెహ్రాన్‌ చేరుకున్నారని అధికారులు చెప్పారు. త్వరలో మరింతమంది అఫ్గాన్లు స్వదేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అఫ్గాన్‌ మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిని అమెరికా ఖండించింది.

మరిన్ని వార్తలు