చిన్న సమస్యే.. 9/11 తర్వాత మళ్లీ ఇప్పుడంతలా!..

12 Jan, 2023 07:53 IST|Sakshi

వాషింగ్టన్‌: ఒక చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో.. కనివినీ ఎరుగని రీతిలో అగ్రరాజ్యంలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం ఏకంగా 5,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 900 విమానాలు రద్దు అయినట్లు తెలుస్తోంది. 

ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ఫ్లైట్‌అవేర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కంప్యూటర్‌ సిస్టమ్‌లో తలెత్తిన సమస్య ఈ గందరగోళానికి కారణమైంది. ఎయిర్‌ మిషన్స్‌ సిస్టమ్‌(NOTAM)లో సమస్యను గుర్తించిన వెంటనే గ్రౌండ్‌ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. నోటామ్‌.. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని అప్రమత్తం చేయడానికి పని చేస్తోంది. దీంతో..  విమానాలన్నీ ఎక్కడికక్కడే రన్‌వేపై ల్యాండ్‌ అయ్యాయి. 

హవాయ్‌ నుంచి వాషింగ్టన్‌, టెక్సాస్‌ నుంచి పెన్సిల్వేనియా రూట్‌లలో విపరీతమైన ప్రయాణికుల తాకిడి ఉంటుంది. విమానాల రాకపోకల నిలిపివేత, ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 9/11 అమెరికా దాడుల తర్వాత.. ఈ స్థాయిలో విమాన సర్వీసుల ఇబ్బందులు తలెత్తడం ఇదేనని పౌరవిమానయాన నిపుణులు పర్వేజ్‌ దామానియా తెలిపారు. ఈ పరిణామం నమ్మశక్యంగా లేదని,  దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.  

ఇక విమాన సేవలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.  గంటల తరబడి పడిగాపులు గాస్తున్నామని, అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే.. క్రమక్రమంగా సర్వీసులను పునరుద్ధరించినట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌. మరోవైపు దేశీయ విమాన సర్వీసులను రెండు గంటలపాటు ఎక్కడికక్కడే నిలిపివేశారు. సమస్యను ఇంకా గుర్తించలేదని, మరోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా చూస్తామని ఎఫ్‌ఏఏ తాజాగా ప్రకటించింది. 

మరిన్ని వార్తలు