పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణపై స్పందించిన అమెరికా

17 Dec, 2022 11:10 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులు చేస్తున్న క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసింది. ఈ ఫోన్‌ సంభాషణపై అగ్రరాజ్య అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని ప్రధాని మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపింది. మీడియా సమావేశంలో పుతిన్‌, మోదీ ఫోన్‌ సంభాషణపై ప్రశ్నించగా.. ఈ మేరకు స్పందించారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌. 

‘భారత ప్రధాని మోదీ మాటలను పరిగణనలోకి తీసుకుంటాం. ఆయన సూచనలు ఆచరణలోకి వచ్చినప్పుడు వాటిని స్వాగతిస్తాం. రష్యాతో ఒప్పందాలపై ఇతర దేశాలు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే, యుద్ధం ప్రభావాన్ని తగ్గించేందుకు మేము మిత్రదేశాలతో సమన్వయంతో పని చేస్తాం. యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు పాటుపడాలనే ఆసక్తి ఉన్న ఏ దేశమైనా.. ఉక్రెయిన్‌ మిత్ర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.’ అని తెలిపారు వేదాంత్‌ పటేల్‌.

పుతిన్‌తో మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని పునరుద్ఘాటించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రష్యా, భారత్‌ దేశాధినేతల మధ్య ఈ ఏడాది ఐదుసార్లు ఫోన్‌ సంభాషణలు జరిగాయి. 

ఇదీ చదవండి: భారత ప్రధానమంత్రి కసాయి

>
మరిన్ని వార్తలు