26/11 కుట్రదారుడు సాజిద్‌ మీర్‌పై విష ప్రయోగం!

5 Dec, 2023 14:06 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఒకవైపు వరుసగా జరుగుతున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) కమాండర్ల మరణాలు అంతచిక్కని మిస్టరీగా మారాయి. మరోవైపు తాజాగా మరో ఎల్‌ఈటీ కమాండర్‌ సాజిద్‌ మీర్‌పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సాజీద్‌ మీర్‌.. కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా ఆస్పత్రి పాలయ్యాడు.

ఆస్పత్రిలో వెంటిలేటర్‌పైన ఉన్న సాజిద్‌పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం అతనికి గత ఏడాది జూన్‌లో శిక్ష విధించగా.. ప్రస్తుతం లఖ్‌పత్‌ జైల్‌లో ఖైదీగా ఉంటూ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణాలకు ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో మరో జైలుకు బదిలీ చేసే సమయంలో ఆస్పత్రి పాలు కావటం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

భారత్‌లో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల కుట్రదారుల్లో ఒకడైన సాజిద్‌ మీర్‌ గత ఏడాది అరెస్టయ్యాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగం రుజువు కావడంతో 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. సాజిద్‌ మీర్‌ను తమకు అప్పగించాలని అమెరికా.. గత కొంతకాలంగా పాక్‌పై ఒత్తిడి తెస్తోంది. అమెరికాకు అప్పగించడం ఇష్టం లేని ISI.. సాజిద్‌పై విషప్రయోగం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

సాజిద్‌ తలకు అమెరికా FBI 5 మిలియన్‌ డాలర్ల వెల కట్టింది. 26/11 మంబై ఉగ్రవాద దాడి కుట్రదారుల్లో ఒకడైన సాజిద్‌.. ఉగ్రవాదులు ముంబై చేరడానికి తెర వెనక కావాల్సిన సాయం చేశాడు.

ఇది కూడా చదవండి: బ్రిటన్ వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..

>
మరిన్ని వార్తలు