సీసీపీ సభ్యులకు వీసా నిబంధనలు కఠినతరం!

5 Dec, 2020 13:51 IST|Sakshi

చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు అమెరికా వీసా నిబంధనలు కఠినతరం

వాషింగ్టన్‌: చైనాతో విభేదాలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) సభ్యులు, వారి కుటుంబాలకు వీసా నిబంధనలు కఠినతరం చేసింది. శుక్రవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. వీటి ప్రకారం... ట్రావెల్‌ వీసాకు నెలరోజుల పాటే గడువు ఉంటుంది. వీసా జారీ చేసిన 30 రోజుల్లోగా దానిని వినియోగించినట్లయితే రద్దైపోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ట్రావెల్‌ వీసా తప్ప ఇమ్మిగ్రేషన్‌, ఉద్యోగ వీసాలకు కొత్త విధానం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఇక అమెరికా ప్రస్తుత విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. సీసీపీ యునైటెడ్‌ వర్క్‌ ఫ్రంట్‌ డిపార్ట్‌మెంటుతో కలిసి పనిచేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారికే ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. (చదవండివిదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!)

‘‘మార్క్సిస్టు- లెనినిస్టు సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు సీసీపీ ప్రయత్నిస్తోంది. అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో తమ భావజాలాన్ని విస్తరింపజేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా యునైటెడ్‌ ఫ్రంట్‌ వర్క్‌తో కలిసి బీజింగ్‌ విధానాలను వ్యతిరేకించే వారిపై విషం చిమ్ముతున్నారు. చైనా మానవ హక్కుల ఉల్లంఘన గురించి విదేశాల్లో గళమెత్తుతున్న విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మైనార్టీలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని లీక్‌ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు’’ అని ఆయన ఆరోపించారు. అలాంటి వారికి ఇకపై అమెరికాలో ప్రవేశం మరింత కఠినతరం కానుందని పేర్కొన్నారు. (చదవండి: చైనా సూపర్‌ సైనికులను సృష్టిస్తోంది: అమెరికా)

కాగా ట్రంప్‌ హయాంలో చైనాతో అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డ్రాగన్‌ దేశంపై మండిపడ్డ ట్రంప్‌.. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పలు చైనీస్‌ యాప్‌లు, వావే వంటి కంపెనీలపై నిషేధం విధించారు. ఈ క్రమంలో అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ చైనాతో బంధంపై ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారనే అంశం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మంగళవారం నాటి ఇంటర్వ్యూలో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాతో బంధాలు మెరుగుపరచుకునే అంశంపై మిత్రపక్షాలతో చర్చిస్తామన్న ఆయన, జింగ్‌ జియాంగ్‌లో మైనార్టీల పట్ల డ్రాగన్‌ దుశ్చర్యలు, డిటెన్షన్‌ సెంటర్‌లో వారిని బంధిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న తీరుపై కూడా తమకు అవగాహన ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు