USA presidential election 2024: ట్రంప్‌కు షాక్‌

21 Dec, 2023 04:18 IST|Sakshi

కొలరాడో కోర్టు సంచలన తీర్పు

కొలరాడో రిపబ్లికన్‌ ప్రైమరీలో పాల్గొనకుండ నిషేధం

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి షాక్‌ తగిలింది. 2024 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021లో కాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడి ఉదంతంలో ఆయన పాత్ర ఉందని తేలి్చంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (సెక్షన్‌ 3) ప్రకారం ట్రంప్‌ను దోషిగా నిర్ధారించింది.

దీని ప్రకారం ప్రభుత్వంపై, ప్రభుత్వ సంస్థలు, భవనాలపై దాడిలో పాల్గొనే అధికారులు భవిష్యత్తులో ప్రభుత్వ పదవులు చేపట్టడానికి అనర్హులు. కాకపోతే అధ్యక్ష అభ్యరి్థని ఈ సెక్షన్‌ కింద పోటీకి అనర్హుడిగా ప్రకటించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి! ఈ తీర్పు కొలరాడో రాష్ట్రం వరకే వర్తిస్తుంది. తీర్పు నేపథ్యంలో కొలరాడోలో రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక (ప్రైమరీ)లో ట్రంప్‌ పోటీ చేయకుండా కోర్టు అనర్హత వేటు వేసింది.

ప్రైమరీ బ్యాలెట్‌ పేపర్ల నుంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ‘‘కాపిటల్‌ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్‌ స్వయంగా పురిగొల్పారు. అక్రమ పద్ధతుల్లో, హింసాత్మకంగా అధికార మారి్పడిని అడ్డుకోజూశారు. తద్వారా దేశ ప్రజల తీర్పునే అపహ్యాసం చేశారు. కనుక సెక్షన్‌ 3 ప్రకారం దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడు’’ అంటూ ఏడుగురు జడ్జిల ధర్మాసనం 4–3 మెజారిటీతో తీర్పు చెప్పింది.

ఆశలపై నీళ్లు!: మరోసారి అధ్యక్షుడు కావాలన్న 77 ఏళ్ల ట్రంప్‌ కలలకు కొలరాడో కోర్టు తీర్పు గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో ఇప్పటికే ఆయన అందరి కంటే ముందున్నారు. కొలరాడో కోర్టుది తప్పుడు తీర్పంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తనను ఏదోలా అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థను కూడా అడ్డగోలుగా వాడుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు.

తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ట్రంప్‌ లాయర్లు ప్రకటించారు. కొలరాడో కోర్టు కూడా తన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు జనవరి 4 దాకా గడువిచి్చంది. అప్పటిదాకా తీర్పు అమలుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ రాజకీయ భవితవ్యాన్ని సుప్రీంకోర్టులోనే తేలనుంది. అయితే, ఒకట్రెండు నెలల్లో రాష్ట్రాలవారీగా ప్రైమరీలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోగా సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించకపోతే ట్రంప్‌ పరిస్థితి ఏమిటన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

కొలరాడోలో మార్చి 5న జరగనున్న ప్రైమరీకి అధ్యక్ష అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రాల ఖరారుకు జనవరి ఐదో తేదే తుది గడువు! అంతేగాక కాపిటల్‌ భవనంపై దాడి ఉదంతానికి సంబంధించి ఇంకా పలు రాష్ట్రాల్లో ట్రంప్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇలాంటి తీర్పే వస్తే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ మరింతగా చిక్కుల్లో పడనుంది. ఈ పరిణామాలపై స్పందించేందుకు డెమొక్రటిక్‌ పార్టీ నిరాకరించింది.

 వివేక్‌ రామస్వామి అండ
రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వానికి ట్రంప్‌తో పోటీ పడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి కూడా కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం విశేషం. ఈ విషయంలో ట్రంప్‌కు అండగా నిలవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ తీర్పు కారణంగా కొలరాడో రిపబ్లికన్‌ ప్రైమరీలో ట్రంప్‌ పోటీ పడలేకపోతే తాను కూడా అక్కడ పోటీ చేయబోనని ప్రకటించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులెవరూ కూడా కొలరాడో ప్రైమరీలో బరిలో దిగొద్దని 38 ఏళ్ల వివేక్‌ ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు