కాలువ శుభ్రం చేస్తుంటే వందలకొద్దీ సైకిళ్లు..

20 Sep, 2023 12:44 IST|Sakshi

భారతదేశం అయినా విదేశాల్లో అయినా సరే ప్రతి పౌరుడి బాధ్యత తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. విదేశాల్లో రోడ్డుపై చెత్త వేయడం నేరంతో సమానం. ఇందుకు కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినా చాలామంది నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలిచింది. 

ఈ వీడియోలో కాలువను శుభ్రం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మురుగునీటిలో నుంచి పెద్ద సంఖ్యలో సైకిళ్లు బయటకు వచ్చి, కుప్పగా ఏర్పడిన తీరు వీడియోలో కనిపిస్తుంది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కాలువను శుభ్రం చేస్తున్న కార్మికులు నీటి అడుగునుంచి పలు సైకిళ్లను వెలికితీశారు. జేసీబీతో ఈ క్లీనింగ్‌ పనులను చేపట్టారు. 

ఈ క్లిప్ @fasc1nate అనే ఖాతాతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది బైక్‌లు, సైకిళ్లను నదులు, చెరువులు, సరస్సులలో విసిరివేస్తున్నారు. ఇదేవిధంగా బైక్‌లు, సైకిళ్లు  ప్రమాదవశాత్తు కూడా నీట మునుగుతున్నాయి. ఈ కారణంగా వాటిని శుభ్రపరిచే సమయంలో పెద్ద మొత్తంలో చెత్త బయటకు వస్తున్నది. కేవలం 2 నిమిషాల 9 సెకన్ల వీడియోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. 

ఇది పలువురి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్‌ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్‌ ఇన్ని సైకిళ్లు ఎ‍క్కడి నుంచి వచ్చాయని రాయగా, మరొకరు ఈ సైకిళ్లను అమ్ముతారా? అని ప్రశ్నించారు. మరొక యూజర్‌ కాలువలోకి ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? అని రాశారు. 
ఇది కూడా చదవండి: శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు?
 

మరిన్ని వార్తలు