కన్నీటి పర్యంతమైన డెలివరీ డ్రైవర్‌

28 Feb, 2021 10:38 IST|Sakshi

ఆకలేస్తే ఇంట్లో ఉంది తింటాం, లేదంటే ఒక్క క్లిక్కుతో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తాం. డెలివరీ బాయ్‌ ఆ ఫుడ్‌ పార్సిల్‌ను చేతికందించగానే ఆవురావురుమంటూ తృప్తిగా ఆరగిస్తాం. అయితే ఎంత ట్రాఫిక్‌లో ఉన్నా, ఏ మూలనో ఉన్నా చెప్పిన సమయానికి మన దగ్గరకు చేరుకునేందుకు డెలివరీ బాయ్స్‌ చాలా కష్టపడుతుంటారు. కానీ ఎవరూ ఈ కష్టాన్ని గుర్తించరు, కొందరైతే కనీసం గౌరవించరు కూడా! ఈ క్రమంలో వారి కన్నీటి గాధలను కళ్లకు కట్టినట్లు చెప్పాడు ఉబర్‌ ఈట్స్‌కు చెందిన డెలివరీ డ్రైవర్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా అది వీక్షకుల మనసులను కదిలించి వేస్తోంది. 

మీరందరూ మా డెలివరీ డ్రైవర్లను తప్పకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తన స్టోరీ చెప్పుకొచ్చాడు. "ఆర్డర్‌ తీసుకోవడానికి ఓ వ్యక్తి కిందకు రాలేదు. దీంతో నాకు ఆ డెలివరీ ఇవ్వడానికి 45 నిమిషాలు పట్టడంతో పాటు మూడు డాలర్లు ఖర్చయ్యాయి. అతడు నాకు ఒకటిన్నర డాలర్లు టిప్పు ఇచ్చాడు. ఈ డెలివరీ చేసినందుకు ఉబర్‌ నాకు రెండున్నర డాలర్లు మాత్రమే ఇస్తుంది. నిలువ నీడ లేని నేను పొట్టకూటి కోసం నిద్ర మానుకుని మరీ ఈ చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటున్నాను. అయినప్పటికీ చాలామంది జనాలు డెలివరీ డ్రైవర్లకు కనీసం టిప్పు కూడా ఇవ్వరు. కరోనాను కూడా లెక్క చేయకుండా మా ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నా ఎవ్వరూ మమ్మల్ని ఖాతరు చేయరు" అని తెగ బాధపడ్డాడు.

ఈ వీడియో చూసి చలించిపోయిన నెటిజన్లు అతడిపై సానుభూతి వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం, ఇక నుంచి నేను డెలివరీ బాయ్స్‌కు మూడున్నర డాలర్ల టిప్పిస్తాను అని ముందుకొస్తున్నారు. బర్నర్డ్‌ హవక్యాంప్‌ అనే వ్యక్తి అతడికి వంద డాలర్లు పంపించానని, మీరు కూడా పంపించండంటూ పిలుపునిచ్చాడు.

చదవండి: ‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’

డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం..

మరిన్ని వార్తలు