మంటల్లో చిక్కుకున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో వైరల్!

23 Nov, 2023 09:17 IST|Sakshi

పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే సంఘటనలు మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకునే వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

అనుకోకుండా ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలు వినియోగదారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిరోడ్డుపై కాలిపోయిన సంఘటన మరిచిపోక ముందే.. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నాగిన నేషనల్ గ్రీన్ ఆటోమొబైల్ వినియోగదారు తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియోలో.. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పెద్దగా మంటలు రావడం చూడవచ్చు. నడిరోడ్డులో కాలుతున్న స్కూటర్‌లో మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన పూణేలో జరిగినట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగటానికి సంబంధించిన వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు, గత రెండు సంవత్సరాల్లో, ఓలా ఎలక్ట్రిక్, ఆంపియర్ ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీ, జితేంద్ర ఈవీ వంటి అనేక బ్రాండ్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఇదీ చదవండి: గేర్‌బాక్స్‌ రిపేర్‌కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్..

ఈ సంఘటనల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి కంపెనీ అధికారులతో చర్చలు జరిగి.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కానీ ఇప్పటికి కూడా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన మీద కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. స్కూటర్ కాలిపోవడానికి ప్రధాన కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు