Rajasthan Assembly elections 2023:పతుల కోసం సతుల ఆరాటం

19 Nov, 2023 06:40 IST|Sakshi

వారి గెలుపు కోసం ముమ్మర ప్రచారం

రాజస్తాన్‌లో ఏడుగురు అభ్యర్థులకు ఇద్దరు భార్యలు

సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారపర్వంలో కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు సైతం ప్రజల మద్దతు కూడగట్టుకొనేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. దక్షిణ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌తో పాటు మేవాడ్, వగడ్‌ ప్రాంతాలలోని రాజ్‌సమంద్, చిత్తోడ్‌గఢ్, దుంగార్‌పూర్, బాన్స్‌వాడా, ప్రతాప్‌గఢ్‌ల్లోని 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏడుగురికి ఇద్దరు భార్యలున్నారు. వారంతా భర్తల గెలుపు కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు.

ప్రతాప్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఇద్దరేసి భార్యలున్నారు. ఈ అభ్యర్థుల భార్యలిద్దరూ ఇటీవల జరిగిన కర్వా చౌత్‌ పండుగను కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. అంతేగాక ఇటీవల దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లోనూ ఈ ఏడుగురు అభ్యర్థులందరూ తమ ఇద్దరు భార్యల గురించి పేర్కొన్నారు.

వీరిలో ఉదయ్‌పూర్‌ జిల్లాలోని వల్లభ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఉదయ్‌లాల్‌ డాంగి, ఖేర్వారా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ దయారామ్‌ పర్మార్, ఝాడోల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి హీరాలాల్‌ దరంగి, ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని ప్రతాప్‌గఢ్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమంత్‌ మీనా, కాంగ్రెస్‌ అభ్యర్థి రాంలాల్‌ మీనాల భార్యలు పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ప్రజల మధ్యకు వెళ్లి తమ తమ భర్తలకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేగాక వగడ్‌ ప్రాంతంలోని బాన్స్‌వాడా జిల్లా గర్హి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాశ్‌ చంద్ర మీనా, ఘటోల్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి నానాలాల్‌ నినామాకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వివాహం మాత్రమే చెల్లుబాటు అయినప్పటికీ, రాజస్తాన్‌ గిరిజనులలో బహుభార్యత్వం ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు