Vladimir Putin: ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగానే పుతిన్

17 Dec, 2023 09:43 IST|Sakshi

మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి వ్లాదిమిరి పుతిన్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుతిన్‌ను ఆయన మద్దతుదారులు లాంఛనంగా ప్రతిపాదించారు. మరో ఆరేళ్ల కాలానికి 2024లో రష్యాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పుతిన్ అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయట్లేదు. అయినప్పటికీ పుతిన్‌కు ఆ పార్టీ పూర్తి మద్దతునిచ్చింది.

పార్టీ టికెట్‌పై కాకుండా అధ్యక్షునిగా ఇలా పోటీ చేయడానికి కనీసం 500 మంది మద్దతు అవసరమని రష్యా ఎన్నికల చట్టాలు చెబుతున్నాయి. ఇదేగాక 40 ప్రాంతాల నుంచి కనీసం 3 లక్షల మంది సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. పుతిన్‌కు మద్దతు పలికినవారిలో అధికార 'యునైటెడ్‌ రష్యా పార్టీ' నేతలు, ప్రముఖ నటులు, గాయకులు, క్రీడాకారులు ఉన్నారు.

పుతిన్‌ 2011లో నెలకొల్పిన రాజకీయ సంకీర్ణ కూటమి 'పీపుల్స్‌ ఫ్రంట్‌' ఏకగ్రీవంగా ఆయన్ని నామినేట్‌ చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టనున్నారు. 2012 ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్రునిగానే బరిలో దిగారు. ఈ సారి కూడా ఆయన ఎన్నికవడం లాంఛనంగా మారనుంది. మరోమారు ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షునిగా పనిచేయనున్నారు.

ఇదే చదవండి: బందీలపై కాల్పులు!

>
మరిన్ని వార్తలు