గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్‌ స్పందన

31 Oct, 2023 07:09 IST|Sakshi

టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్‌ స్పందించింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ప్రకటించారు. కాల్పుల విరమణ పాటిస్తేనే.. మానవతా సాయం గాజాకు అందుతుందని, లేకుంటే అక్కడి పరిస్థితులు మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నెతన్యాహూ స్పందించారు. 

ఇజ్రాయెల్‌  చేస్తున్న యుద్ధంలో కాల్పలు విరమణ ఉండదు. ఎందుకంటే అది హమాస్‌కు లొంగిపోవడమే అవుతుంది గనుక అని అన్నారాయన. ‘‘కాల్పుల విరమణ కోసం ఇస్తున్న పిలుపు.. ఇజ్రాయెల్ హమాస్‌కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపు ఇవ్వడమే అవుతుంది. కాబట్టి అది జరగదు. యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుంది అని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ సోమవారం ప్రకటించారు. 

మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.‘‘ప్రస్తుత ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ సరైన సమాధానం అని మేము భావించం అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. అయితే గాజాలో సాయం అందాలంటే.. యుద్ధ విరమణల సమయం కేటాయిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 

మరిన్ని వార్తలు