Russia Ukraine War: భారత్‌పై అమెరికా అక్కసు.. యుద్దం వేళ రష్యాతో డీల్‌పై సంచలన వ్యాఖ్యలు

16 Mar, 2022 11:21 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. కీవ్‌ను టార్గెట్‌ చేసిన రష్యాన్‌ బలగాలు రెచ్చిపోయి మరీ బాంబు దాడులకు పాల్పడుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలు అంటూనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తమ సైన్యానికి ఎప్పటికప్పడు కీలక సూచనలు చేస్తున్నారు. మరోవైపు శాంతి నాలుగు సార్లు జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. అటు ఉక్రెయిన్‌లోని చిన్న నగరాలను రష్యన్‌ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఇదిలా ఉండగా.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరిపై అమెరికా తొలిసారిగా స్పందించింది. ఈ క్రమంలో భారత్‌పై సంచలన వ్యాఖ‍్యలు చేసింది. ఉక్రెయిన్‌పై యుద్దం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు, ఈయూ సైతం ఆంక్షలు విధించిన విషయం తెలిసందే. దీంతో రష్యా.. భారత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్‌ను సరఫరా చేస్తామని ప్రకటించింది. అనంతం భారత్‌ ఈ ఆఫర్‌ను అంగీకరించింది. ఈ నేపథ్యంలో భారత్‌ అంగీకారంపై అమెరికా వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ పిసాకీ బుధవారం ఘాటుగా స్పందించారు.

రష్యా ఇచ్చిన ఆఫర్‌ను భారత్ అంగీకరించడాన్ని తాము తప్పు పట్టలేమని పిసాకీ స్పష్టం చేశారు. అలాగే.. ఈ పరిణామాన్ని రష్యాపై తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్టు కూడా స్పష్టంగా చెప్పలేమన్నార. యుద్ధానికి దిగిన రష్యా వైపు మొగ్గు చూపడాన్ని మాత్రం తాము ఎంతమాత్రం సమర్థించట్లేదన్నారు. యుద్ధం వైపు మొగ్గు చూపడమా..? లేక శాంతికాముక దేశంగా ఉన్నామా..? అనేది చరిత్ర పుస్తకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని జెన్ పిసాకీ చెప్పారు. పుతిన్‌కు మద్దతు పలకడం, యుద్ధాన్ని సమర్థించడం అనేది విధ్వంసకర నిర్ణయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరోవైపు.. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్దం ప్రారంభమైన నాటి నుంచి భారత్‌ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపైనా కూడా అటు రష్యా వైపుకు గానీ, ఇటు ఉక్రెయిన్‌కు గానీ సపోర్టు చేస్తున్నట్టు ప్రకటన చేయలదు. అదే సమయంలో యుద్దాన్ని తాము కోరుకోవడంలేదని, తక్షణమే యుద్దాన్ని నిలిపివేయాలని కోరింది. ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా భారత్‌కు రష్యా నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. భారత దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం రష్యా నుంచే ఎక్కువ వాటలో రక్షణ పరికారాలను ఇండియా కొనుగోలు చేస్తోంది.

ఇది చదవండి: యుద్ధానికి రష్యా గుడ్‌ బై చెప్పనుందా?.. అదే కారణమా?

మరిన్ని వార్తలు