తమ్ముడి వరసయ్యే వాడితో ప్రేమ.. ఓ టీవీ షోలో..

15 May, 2021 15:01 IST|Sakshi
మ్యాడీ

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ

అన్న ఓ సినీ రచయిత రాతలకు ఇంగ్లాండ్‌కు చెందిన మ్యాడీ నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది. తమ్ముడి వరసయ్యే(?) వ్యక్తితో ప్రేమలో పడ్డ ఆమె.. ఓ టీవీ షోలో తన మనసు విప్పింది. ఏళ్ల దూరాన్ని దగ్గర చేసింది. మనసుపడ్డ వాడిని చేరుకుంది.

వివరాలు.. ఇంగ్లాండ్‌కు చెందిన మ్యాడీ తల్లికి, కాలమ్‌ తండ్రికి తొమ్మిదేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అప్పుడు మ్యాడీ, కాలమ్‌లు చిన్నపిల్లలు. అయితే, కొన్ని అనివార్యకారణాల వల్ల వారిద్దరి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. పెద్దలు విడిపోయినప్పటికి మ్యాడీ, కాలమ్‌లు సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారు. ఈ నేపథ్యంలో మ్యాడీ కాలమ్‌ను ఇష్టపడటం మొదలుపెట్టింది. తాజాగా, ఐటీవీ సీక్రెట్‌ క్రష్‌ అనే డేటింగ్‌ షోలో కాలమ్‌పై ఉన్న ప్రేమను బహిర్గతం చేసింది. సాధారణంగా ఎవరైనా తమకిష్టమైన వాళ్లతో డేటింగ్‌ చేయాలనుకుంటే ఈ షో ద్వారా వాళ్లకు తమ ప్రేమను తెలియజేస్తారు. ఎదుటి వ్యక్తికి వీరి ప్రేమ ఇష్టమైతే డేటింగ్‌కు వెళతారు. లేదంటే, వారినుంచి ఎలాంటి స్పందన రాదు. ఆ షోలో మ్యాడీ మాట్లాడుతూ.. ‘‘ నేను కాలమ్‌ను ఇష్టపడుతున్నానని చెప్పటానికి ఈ షోకు వచ్చాను. మా అమ్మ, వాళ్ల నాన్న తొమ్మిదేళ్ల క్రితం కలిసి ఉండేవారు.

రెస్టారెంట్‌లో కాలమ్‌తో మ్యాడీ

అయితే, ఇప్పుడు మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. మా పెద్దలు విడిపోయిన తర్వాత కూడా మేము సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉండేవాళ్లం. అతడు చాలా మంచివాడు, అందగాడు’’ అని చెప్పుకొచ్చింది. వారి తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత మ్యాడీ,కాలమ్‌లు ముఖాముఖీగా కలవలేదు. కేవలం సోషల్‌ మీడియాలో మాత్రమే టచ్‌లో ఉండేవారు. అక్కడే కాలమ్‌పై మ్యాడీకి ప్రేమ పుట్టింది. మ్యాడీ తనను ప్రేమిస్తోందని తెలుసుకున్న కాలమ్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. ‘‘నేను నమ్మలేకపోతున్నాను. మన పెద్దలు విడిపోయిన తర్వాత నేను నీతో మాత్రమే టచ్‌లో ఉన్నాను. ఇన్నేళ్లలో నిన్ను నేను చూడను కూడా చూడలేదు. మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా.

నువ్వు నీ ప్రేమను రహస్యంగా ఉంచావు. నిజంగా నమ్మలేకుండా ఉన్నా’’ అని అన్నాడు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ ఓ రెస్టారెంట్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మ్యాడీ మాట్లాడుతూ.. ‘‘మేము చట్టవ్యతిరేకమైన పని చేయటం లేదు. ఎందుకంటే మేము మా బంధాన్ని రహస్యంగా ఉంచటం లేదు’’ అని అంది. కాలమ్‌ మాట్లాడుతూ.. ‘‘నిజానికి మేము సవతి సోదరీ, సోదరులం కూడా కాదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఈ విషయం తెలిస్తే నాన్న నాపై మాటలు పేలుతారు. ఇంకెలా స్పందిస్తారో నాకు తెలియదు. కానీ, నేను దాన్ని లెక్క చేయను. ఇది ఆయనకు సంబంధించిన విషయం కాదు. నీకు,నాకు సంబంధించినది’’ అని అన్నాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు