వరికోతలు.. పెళ్లిళ్లు.. ప్రచారం

11 Nov, 2023 00:50 IST|Sakshi

ఈ నెల అందరికీ కీలకం

కరీంనగర్‌రూరల్‌: నవంబర్‌ నెల అందరికీ కీలకంగా మారింది. ఈ నెలలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు, వానాకాలం సీజన్‌ వరికోతలు, వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రైతులు వరికోతలు చేపట్టి, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల గడువు శుక్రవారం ముగిసింది. ఈ నెల 15 నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేపట్టనున్నారు. అయితే, ఈ నెలలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతుండటంతో ప్రచారంతోపాటు పోలింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 16, 18, 24, 28, 29 తేదీల్లో వివాహ ముహూర్తాలున్నాయి. దీంతో అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఫంక్షన్‌హాళ్లలో సందడి చేయనున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు ఇచ్చినప్పటికీ పనుల ఒత్తిళ్ల సాకుతో గైర్హాజరయ్యేవారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ కావడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తప్పనిసరిగా వివాహాలకు హాజరవుతారు. ఫలితంగా విందు ఖర్చు భారీగా పెరుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ నెల 29న పెళ్లి ఉంటే మరుసటి రోజు పోలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. బంధువులు, మిత్రులు రాకతో ఓటింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతాయేమోనని అభ్యర్థులు కలవరపడుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలపై కార్యకర్తలతో అంతర్గతంగా చర్చిస్తున్నారు.

మరిన్ని వార్తలు