పట్టుకున్న సొమ్ము సామాన్యులదే | Sakshi
Sakshi News home page

పట్టుకున్న సొమ్ము సామాన్యులదే

Published Sat, Nov 11 2023 12:50 AM

కలెక్టరేట్‌లోని కమిటీ కార్యాలయం - Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: శాసనసభ ఎన్నికల క్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఇప్పటివరకు పట్టుకున్న సొమ్ము దాదాపు సామాన్యులదే. వ్యాపారాలు, ఇతరత్రా అవసరాలకు తరలిస్తున్న నగదు, బంగారాన్ని పట్టుకోగా జిల్లాలో వివిధ తనిఖీల ద్వారా రూ.3.84కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సదరు సొమ్మును విడుదల చేయగా, ఆదాయపు పన్నుశాఖకు అప్పగించింది ఒక్క కేసు లేదు. పట్టుకున్న సొమ్ము విడుదల, జప్తు వంటి అధికారాలకు జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీ ఎన్నికల నిబంధనల మేరకు పర్యవేక్షిస్తోంది. ప్రధాన రహదారులపై పోలీసులతోపాటు నిఘా బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పెద్దఎత్తున డబ్బు చిక్కితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తారు. ఒకవేళ లెక్కపత్రాలు సరిగా ఉంటే మాత్రం వెంటనే విడిచిపెట్టేందుకు ఆస్కారముంది. ఎక్కడైనా డబ్బు పట్టుకుంటే తప్పనిసరిగా నియమిత కమిటీ దృష్టికి తీసుకొచ్చేలా ప్రామాణిక కార్యాచరణ విధా నం (ఎస్‌వోపీ) అమలు చేస్తున్నారు.

వాహన తనిఖీలు

సాధారణ ఎన్నికల నేపథ్యంలో స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ వాహనాలు తనిఖీలు చేస్తున్నాయి. ఒకవేళ వాహన తనిఖీల్లో రూ.50వేలకు మించి దొరికితే.. ఆధారాలు చూపించాలని అడుగుతున్నారు. ఈ బృందాలతోపాటు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు సైతం నిఘా తీవ్రతరం చేశా యి. ఈ ఆక్రమ తరలింపు వ్యవహారంలో కొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది దారి తప్పే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణ కమిటీని నియమించింది. క్షేత్రస్థాయి తనిఖీ బృందాలు గనక పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుంటే.. ఆధారాలు సరిగానే ఉన్నాయని సత్వరమే విడిచిపెట్టే అవకాశం లేదు. తప్పనిసరిగా డబ్బును పట్టుకున్న విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకురావాల్సిందే.

రూ.10 లక్షలు దాటితే ఐటీకి

పట్టుకున్న సొమ్ము విలువ రూ.10లక్షల వరకు ఉంటే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. లెక్కా పత్రాలు సరిగా ఉంటే వదిలి పెట్టనున్నారు. ఒకవేళ లెక్కాపత్రం సరిగా ఉన్నా సరే రూ.10 లక్షల కన్నా ఎక్కువ సొమ్ము తరలిస్తుంటే మాత్రం కమిటీ తప్పనిసరిగా ఆదాయ పన్నుశాఖ నోడల్‌ అధికారికి సమాచారం అందిస్తున్నారు. అనంతరం ఆదాయ పన్ను శాఖ యంత్రాంగం.. సదరు వ్యక్తులకు తాఖీదులు జారీ చేస్తోంది. వివరణ సంతృప్తికరంగా ఉంటే పర్వాలేదు. లేకుంటే మాత్రం లెక్క ప్రకారం పన్ను మినహాయించుకొని తిరిగి ఇవ్వనున్నారు.

సుమోటోగా విచారణ

ప్రస్తుతం రూ.50వేల కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు తరలిస్తూ తనిఖీ బృందాలకు చిక్కితే ఆ డబ్బు ఎక్కడిదని ఆరా తీస్తున్నారు. ఆ వివరాల్ని వెంటనే రిటర్నింగ్‌ అధికారితోపాటు పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఒకవేళ పత్రాలు సరిగా ఉండి.. ఆ డబ్బు ఎన్నికల వ్యవహారంతో సంబంధం లేనిదేనని కచ్చితంగా నిర్ధారించుకుంటే మాత్రమే స్థానిక రిటర్నింగ్‌ అధికారి సూచనతో వదిలేస్తున్నారు. ఏమాత్రం అనుమానమొచ్చినా కమిటీ సుమోటోగా ఆ వ్యవహారంపై విచారణ జరపనుంది. ఆ తరహా సంఘటనల గురించి రోజువారీ నివేదికలు రూపొందించనుంది. ఒకవేళ సొమ్మును జప్తు చేస్తే మాత్రం అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం ఇస్తోంది. ఎవరికి అప్పీలు చేసుకోవాలనే విషయాన్ని డబ్బు తరలిస్తున్న వ్యక్తులకు తెలియజేస్తోంది.

తనిఖీలతో నియోజకవర్గాల వారీగా పట్టుబడిన నగదు (రూ.ల్లో)

నియోజకవర్గం నగదు విడుదల బంగారం

కరీంనగర్‌ 3,25,52,726 3,25,52,726 0

హుజూరాబాద్‌ 23,74,780 22,63,690 0

చొప్పదండి 7,68,900 6,34,600 102.83గ్రా

మానకొండూరు 12,37,570 10,22,570 0

జిల్లాలో రూ.3.84 కోట్లు స్వాధీనం

రూ.10 లక్షల వరకు

పర్యవేక్షణ కమిటీదే నిర్ణయం

అంతకు మించితే

ఆదాయ పన్నుశాఖకు సమాచారం

పర్యవేక్షణ కమిటీలో వీరు..

నోడల్‌ అధికారి: డీఆర్డీవో శ్రీలతారెడ్డి

కన్వీనర్‌: డీసీవో రామానుజాచార్య

సభ్యులు: నాగరాజు, ఆడిట్‌శాఖ అధికారి

Advertisement
Advertisement