జీవన్‌రెడ్డి ఓడినా.. పదవి యోగం!

5 Dec, 2023 11:58 IST|Sakshi
జీవన్‌రెడ్డి

జగిత్యాలజోన్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి పదవీకాలం 2025 మే వరకు ఉండటంతో.. ఆయనకు పదవి యోగం వచ్చే అవకాశముందని జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

శాసన మండలిలో కాంగ్రెస్‌ తరఫున ఏకైక ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఉండటంతో.. జీవన్‌రెడ్డిని శాసన మండలి నాయకుడిగా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు కొత్తగా ఎన్నికై న 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మంది కొత్తవారు కావడంతో.. ప్రభుత్వంపై పట్టు ఉండే అవకాశం లేదు. దీంతో సీనియర్‌ నాయకుడితో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు, సాగునీటి వ్యవస్థపై మంచి పట్టున్న జీవన్‌రెడ్డికి వ్యవసాయ మంత్రి పదవిస్తే.. అసెంబ్లీలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రతిపక్షాల నుంచి వచ్చే మాటల దాడులను తిప్పికొట్టేందుకు సరైన నాయకుడు జీవన్‌రెడ్డి అని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా 2024 ఏడాదిలో పార్లమెంట్‌ ఎన్నికలుండటం.. గతంలో కేసీఆర్‌పై రెండుసార్లు ఎంపీగా పోటీ చేయడంతో.. జీవన్‌రెడ్డిని పార్లమెంట్‌కు పంపేందుకు సైతం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే కరీంనగర్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో బేస్‌ ఏర్పాటు చేసుకునేందుకు జీవన్‌రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకొని.. ఆ రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పట్టు బిగించేందుకు కూడా కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. జీవన్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడిని.. నా సేవలు పార్టీకి అవసరమనుకొని ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఏనాడూ పదవుల కోసం తాపత్రయపడలేదని, పదవి వచ్చినా ఒక్కటే, రాకున్నా ఒక్కటేనని, ఎప్పుడూ ప్రజల మధ్యే ప్రజాసేవ కోసం కృషి చేస్తానని ప్రకటించడం విశేషం.

>
మరిన్ని వార్తలు