వనరుల వినియోగంతో లాభాలు | Sakshi
Sakshi News home page

వనరుల వినియోగంతో లాభాలు

Published Fri, Dec 22 2023 1:38 AM

ఆకుకూరలు పరిశీలిస్తున్న కలెక్టర్‌, అధికారులు - Sakshi

● కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ● వ్యవసాయ క్షేత్రం పరిశీలన

నిర్మల్‌ రూరల్‌: వనరులు ఉపయోగించుకుని సాగు చేస్తే రైతులకు అనేక లాభాలు కలుగుతాయని కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పేర్కొన్నారు. గురువారం కొండాపూర్‌ సమీపంలోగల నిర్మల్‌ మండల సమీకృత వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల పంటలు, సర్క్యులేటరీ ఆక్వా కల్చర్‌ విధానాన్ని అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌అహ్మద్‌తో కలిసి పరిశీలించారు. సేంద్రియ విధానంలో ఐదంచెల వ్యవసాయ విధానం, కొరమీను చేపల పెంపకం, నాటుకోళ్ల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్క్యులేటరీ ఆక్వా కల్చర్‌ విధానం రైతుల కోసం రూపొందించబడిందని తెలిపారు. 15వేల లీటర్ల సామర్థ్యంగల వృత్తాకార ట్యాంక్‌, ఆక్సిజన్‌ సరఫరా కోసం రింగ్‌ బ్లోవర్‌ సిస్టం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చేప పిల్లలు పెరిగే వరకూ వా టికి ఫీడ్‌ సైకిల్స్‌, నీటి నాణ్యత నిర్వహణతో రక్షించుకోవాలని సూచించారు. ఈ ట్యాంక్‌లో నాలుగు నెలలు చేపపిల్లలు పెంచుకున్న తర్వాత ఫాండ్‌లోకి చేర్చుతామని తెలిపారు. ఒకే సంవత్సరంలో మూ డు పంటల దిగుబడులు సాధించే అవకాశం సర్క్యులేటరీ ఆక్వా కల్చర్‌ విధానం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. భూగర్భ జలాలు చేపల పెంపకానికి వాడిన తర్వాత నైట్రోజన్‌, అమ్మోనియా శాతం కలిగిన నీరు సేంద్రియ ఎరువుతో సమానమని తెలిపారు. ఈ నీటిని కూరగాయల పెంపకం, వరి సాగుకు ఉపయోగించడం ద్వారా యూరియా అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. ఎకరంలో సాగు చేస్తున్న తీగ, దుంప జాతులు, ఆకుకూరలు, ఔషధ గుణాల వట్టివేర్లు, పెసలు తదితర పంటలు పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ ఆకుకూరలు కొనుగోలు చేశారు. డీఆర్డీవో విజయలక్ష్మి, అదనపు డీఆర్డీవో గోవింద్‌, ఎంపీడీవో సాయిరాం, ఏపీఎంలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement